గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 26 , 2026 | 02:21 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఆదేశించారు.
అమరావతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో విజయం సాధించామని, గత ప్రభుత్వ విధానాల కారణంగానే అప్పటి అధికార పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైందని వ్యాఖ్యానించారు.
టీడీపీతో పాటు కూటమి పార్టీల సమిష్టి పోరాటం, ఎన్నికల వ్యూహాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగిస్తున్నామని, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కన్వీనర్లు, పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేస్తూ ప్రజలు, కార్యకర్తలతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలని సూచించారు.
'అనుచరులు కాదు.. పార్టీకి నాయకులు కావాలి' అని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేలా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ఎన్నికల సమయంలో హామీలతో ఇంటింటికి వెళ్లినట్లే, ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, సంక్షేమ పథకాల గురించి వివరించాలని చెప్పారు. ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులంతా అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నప్పటికీ, ఏమరుపాటు వద్దని, ప్రజలకు నచ్చని పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువత సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, 'గొడ్డలి పార్టీ' విధానాల వల్ల యువత ఎలా నష్టపోయిందనే అంశాలను కూడా వివరించాలని సూచించారు.
కేవలం డబ్బుతో ప్రజల ఆదరణ పొందలేమని, ప్రజల మధ్య నిరంతరం ఉంటూ ప్రత్యర్థి పార్టీ విధానాలను ఎండగట్టాలని అన్నారు. గొడ్డలి పార్టీ ఇప్పటికీ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించిన చంద్రబాబు, ప్రజలతో నిరంతరం మమేకమైతే అలాంటి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టవచ్చని పేర్కొన్నారు. అగ్రస్థాయి నాయకుల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండటాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది!