నియంతృత్వ పోకడలతో ఏదీ సాధించలేం: అన్నా హజారే
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:16 PM
బీజేపీ నేత, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, జులై 26: సమస్యలు ఏవైనా సరే హింస ద్వారా కాకుండా శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాలపై, విద్యార్థుల నిరసనలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాలకు, నాయకుల మొదటి ధ్యేయం కావాలని ఆయన అన్నారు.
ఉద్రిక్తతలు సృష్టించడం.. నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమని అన్నా హజారే తెలిపారు. ఇప్పటి వరకు తాను 22సార్లు నిరాహార దీక్ష చేశానని.. ఎన్నడూ హింసను ఆశ్రయించలేదని వెల్లడించారు. శాంతియుత ఆందోళనలే (Peaceful Protests) శాసనపరమైన మార్పులు తీసుకురావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. తాను చేపట్టిన శాంతియుత నిరసనల కారణంగా.. 10 చట్టాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
ప్రభుత్వాలు, నేతలు పౌరుల మాట వినాలని.. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని హజారే సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రెండు అడుగులు ముందుకు వేయాల్సి వచ్చినా.. అది తప్పేమి కాదని పేర్కొన్నారు. మన నిర్ణయాలు ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండటమే ముఖ్యమన్నారు. మంత్రుల రాజీనామా వంటి డిమాండ్లను సైతం శాంతియుత పద్ధతిలో సాధించుకోవాలని ఆయన సూచించారు. హింసాత్మక నిరసనల కంటే శాంతియుత పద్ధతిలో చేపట్టే నిరసనలు, చర్చలే ప్రజల్లో, పాలనలో మార్పు తీసుకువస్తాయన్నారు. ఎంతటి పరిస్థితులు ఎదురైనా హింసను మాత్రం ఆశ్రయించొద్దని ప్రజలకు, యువతకు, ప్రభుత్వానికి అన్నా హజారే సూచించారు.
ఇవి కూడా చదవండి:
విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక