Share News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:06 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో విద్యార్థుల ఆందోళనలకు ముగింపు పడినప్పటికీ.. సోషల్‌ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ కుమార్తె చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ నేత, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామాతో విద్యార్థుల ఆందోళనలకు ముగింపు పడింది. అయితే ఈ అంశానికి సంబంధించి సోషల్‌ మీడియాలో మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి (Aparajita Sarangi) కుమార్తె అర్చితా సచిన్‌ రహర్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. ప్రధాన్‌ రాజీనామాతో అర్చితా సంబరాలు చేసుకోవడం గమనార్హం. అర్చితా కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా ఉంటే.. తన మద్దతు మాత్రం విద్యార్థులకేనంటూ ఆమె పెట్టింది. అయితే, కొన్ని గంటల్లోనే అర్చితా సోషల్‌ మీడియా ఖాతాలు కనిపించకుండా పోవడం గమనార్హం.


విద్యార్థులు, యువత చేపట్టిన భారీ నిరసనలతో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారంటూ అర్చితా పోస్టు చేయడం బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై ధర్మేంద్ర ప్రధాన్‌ కార్యాలయం నుంచి ఓ విజ్ఞప్తి వచ్చిందని, దీంతో ఆ పోస్టును తొలగించాలని ఎంపీ తన కుమార్తెను కోరినట్లు సమాచారం. అయితే, అర్చితా మాత్రం అందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని చెబుతూ మరో పోస్టు చేసిన ఎంపీ కుమార్తె.. ఎట్టిపరిస్థితుల్లో దానిని తొలగించనని స్పష్టం చేశారు.


'నేను చేసిన పోస్ట్‌ను డిలీట్ చేయమని మా అమ్మకు సందేశం పంపే ప్రయత్నం చేయకండి 'డీపీ పీఏ' (ధర్మేంద్ర ప్రధాన్ పీఏ). గతంలో కూడా ఇలాగే జరిగింది. వ్యర్థ ప్రయాస పడకండి. నేను ఈ పోస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయను. జై జగన్నాథ్! జై హింద్!' అని ఆమె ఆ పోస్ట్‌లో స్పష్టం చేశారు. ఈ వివాదం సంచలనంగా మారిన కొద్దిసేపటికే అర్చిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించకుండా పోవడం గమనార్హం.


ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎంపీ అపరాజిత స్పందిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం గొప్ప విషయమని, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు అండగా నిలుస్తానని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. సొంత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని, జెన్‌ జీ తరానికి చెందిన అర్చితాకు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని ఎంపీ ఆఫీస్ ఓ జాతీయ మీడియా సంస్థతో పేర్కొంది. ఇదిలాఉంటే, అంతకుముందు అస్సాం మంత్రి కేశవ్‌ మహంతా కుమార్తె ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 26 , 2026 | 06:18 PM