Share News

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:46 PM

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీఐ ఎండీఆర్‌ విధించాలనే నిర్ణయంపై ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేసింది.

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం
Govt Debunks External Pressure Claim On UPI Merchant Fee

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్రం నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. ఆ వాఖ్యల్ని కేంద్రం తోసిపుచ్చింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్తగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) విధించాలనే నిర్ణయం ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేసింది. డిజిటల్‌ చెల్లింపుల విధానాలపై భారత్‌ స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ వివరించింది. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కొత్త విధానం లక్ష్యమని పేర్కొంది.


అసలేం మారిందంటే?

అక్టోబరు 15 నుంచి నిర్దిష్ట వ్యాపారి-చెల్లింపుల(P2M) యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ అమల్లోకి రానుంది. రూ.2,000కు మించిన అర్హత కలిగిన లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తారు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఉంటుంది. అయితే.. ఈ రుసుమును నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్సన్ టూ పర్సన్‌కు(P2P) జరిగే యూపీఐ బదిలీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయంది. రూ.2,000 వరకు జరిగే వ్యాపారి చెల్లింపులు, చిరు వ్యాపారులకు వర్తించే కొన్ని లావాదేవీలకూ ఎండీఆర్‌ ఉండదు. సుమారు 96 శాతం P2M లావాదేవీలు ఈ కొత్త ఎండీఆర్‌ పరిధిలోకి రావని కేంద్రం తెలిపింది.


అయితే.. ఈ ఎండీఆర్‌ విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. అమెరికా డిమాండ్‌కు కేంద్రం తలొగ్గిందని, యూపీఐపై ఇప్పటివరకు ఉన్న జీరో ఎండీఆర్‌ను మార్చడం వెనుక యూఎస్ కార్డ్ నెట్‌వర్క్‌లకు ప్రయోజనం కల్పించే ఉద్దేశముందని కాంగ్రెస్‌ నేత జైరామ్ రమేశ్‌ ఆరోపించారు. యూఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం గతంలో యూపీఐ ఉచితంగా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న కాంగ్రెస్.. అందువల్లే ఈ నిర్ణయం వెలువడిందని ఆరోపించింది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు, రష్యా నుంచి ఇంధన దిగుమతులపై.. యూఎస్ ప్రతిపాదిస్తున్న సుంకాలు, హెచ్‌-1బీ వీసా అంశాలనూ కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావించారు. అయితే.. వీటికి, యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయానికి సంబంధముందనే ఆధారాలను ప్రభుత్వం అంగీకరించలేదు.


ఇవీ చదవండి:

పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్

Updated Date - Sep 16 , 2026 | 02:52 PM