Share News

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:24 PM

బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన
Uddhav Thackeray

ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టడంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(UBT) తొలిసారి స్పందించింది. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో పేర్కొంది.


'యుద్ధం ఇప్పటితో ముగియలేదు. మరాఠా వ్యక్తులకు తగినంత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది' అని శివసేన యూబీటీ ట్వీట్ చేసింది.


సీట్లు.. ఓట్లు

బీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమి ఏకైక పెద్ద కూటమిగా నిలిచింది. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కూటమి సైతం గణనీయంగా సీట్లు, ఓట్లు సాధించింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. బీజేపీ 89 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి 11,79,273 ఓట్లు పోలయ్యాయి. 21.58 శాతం ఓటింగ్ షేర్ సాధించింది. గెలిచిన అభ్యర్థుల్లో బీజేపీ ఓట్ షేర్ 45.22 శాతంగా ఉంది. దీంతో ఏకైక పెద్దపార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీ భాగస్వామి పార్టీ అయిన శివసేన(షిండే వర్గం) 29 సీట్లు గెలుచుకుంది. 2,77,326 ఓట్లు సాధించింది. మొత్తం ఓట్ షేర్‌లో 5 శాతం దక్కించుకుంది. బీజేపీ-శివసేన(షిండే) కలిసి బీఎంసీలో అతిపెద్ద కూటమిగా నిలిచింది.


ఎంఎన్ఎస్‌తో కలిసి పోటీ చేసిన శివసేన(యూబీటీ) 65 సీట్లు గెలుచుకుంది. యూటీబీ సారథ్యంలోని సేనకు 7,17,735 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 13.13 శాతం. ఎంఎన్‌ఎస్ 6 సీట్లు దక్కించుకుంది. 74,946 ఓట్లు గెలుచుకుని.. 1.37 శాతం ఓట్ షేర్ సంపాదించింది. కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు గెలుచుకుని 4.44 శాతం ఓట్ షేర్ సాధించింది. ఇతర పార్టీల్లో ఎఐఎంఐఎం 8 సీట్లతో 68,072 ఓట్లు సాధించింది. ఎన్‌సీపీ 3 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ 2 సీట్లు, ఎన్‌సీపీ(శరద్‌చంద్ర పవార్) పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2026 | 01:30 PM