Kangana Ranaut: నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 10:11 AM
బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.
ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి గండిగొట్టి బీజేపీ, శివసేన మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ అందరికీ గొప్ప విజయమని అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారామె. ఇదే సమయంలో గతంలో ముంబైలోని తన ఆఫీసు కూల్చివేత ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించారు.
'గతంలో నన్ను వేధించిన వారిని, నా ఇంటిని కూల్చేసిన వారిని, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోవాలని బెదిరించిన వారిని ఇప్పుడు రాష్ట్రమే వదిలేసింది. మహిళా విద్వేషులు, బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన చోటు చూపించారు' అని కంగనా రనౌత్ విమర్శించారు. బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయంపై కొంత భాగాన్ని 2020లో బీఎంసీ అధికారులు నిబంధనల పేరుతో కూల్చేశారు. దీనిపై ముంబై కోర్టును కంగన ఆశ్రయించడంతో బీఎంసీ చర్యను కోర్టు తప్పుపట్టింది. కూల్చివేతలను ఆపాలని, ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది.
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2,869 స్థానాలకు గానూ 1,372 స్థానాలను బీజేపీ సారథ్యంలోని మహాయుతి గెలుచుకుంది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌నూ కైవసం చేసుకుంది. బీఎంసీలోని 227 వార్డులకు మెజారిటీ మార్క్ 114 కాగా.. బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ మార్కును దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..
చైనాతో యుద్ధం వేళ 600 కిలోల బంగారమిచ్చిన దర్భంగ మహారాణి కామసుందరి కన్నుమూత
‘ఐ ప్యాక్’లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి