Supreme Court: ‘ఐ ప్యాక్’లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:55 AM
కోల్‌కతాలో ‘ఐ ప్యాక్’ అధిపతి ప్రతీక్ జైన్ ఇంట ఈడీ సోదాలను అడ్డుకున్న వ్యవహారంలో బెంగాల్ సీఎం మమతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
న్యూఢిల్లీ, జనవరి 16: కోల్‌కతాలో ‘ఐ ప్యాక్’ అధిపతి ప్రతీక్ జైన్ ఇంట ఈడీ సోదాలను అడ్డుకున్న వ్యవహారంలో బెంగాల్ సీఎం మమతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన 3 కేసుల్లో దర్యాప్తుపై స్టే విధించింది. ఈడీ తదితర కేంద్ర సంస్థల దర్యాప్తులో రాష్ట్ర సంస్థలు జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. ‘‘ఒక పార్టీకి చెందిన ఎన్నికల పనుల్లో వేలుపెట్టే అధికారం కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేదు. అయితే ఆ ముసుగులో వేరే కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులను అడ్డుకోవచ్చా’’ అని ప్రశ్నించింది. మమత, డీజీపీ రాజీవ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. గతంలో సీబీఐకి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య వేరే కేసులో జరిగిన ఘర్షణను ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పరిపాటిగా మారిందన్నారు.