మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..
ABN , Publish Date - May 14 , 2026 | 02:52 PM
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'సర్' ప్రక్రియ మూడో దశ అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దఫా కింద మొత్తం 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)' ప్రక్రియను మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దశ కింద 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియను నిర్వహించనున్నట్టు ఈసీ గురువారం ప్రకటించింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు మినహాయింపునిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాలకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) పేరిట చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం.. 2025 జూన్-సెప్టెంబర్‌లో బిహార్‌లో తొలి దశ కింద నిర్వహించారు. రెండో దశ 2025 అక్టోబర్ 27న.. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు మొత్తం 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించింది ఈసీ. ఈ ప్రక్రియ ఫలితంగా మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 10.2 శాతం మేర తగ్గింది. దీంతో ఓటర్ల సంఖ్య 50.99 కోట్ల నుంచి 45.81 కోట్లకు పడిపోయింది. జనగణన ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న ఇళ్ల జాబితా తయారీకి ఉపయోగించే ఉమ్మడి క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని మూడో దశ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ఈసీ తెలిపింది. ఈ దశలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి 36.73 కోట్ల మంది ఓటర్లను సర్వే చేస్తారని పేర్కొంది.
'సర్' మూడో దశ షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఓటర్లందరూ ప్రత్యేక సమగ్ర సవరణలో ఉత్సాహంగా పాల్గొనాలి. అర్హులైన ఓటర్లు మాత్రమే ఉండేలా.. అనర్హుల పేర్లేవీ చేరకుండా చూసుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాం' అని అన్నారు.
ఇవీ చదవండి:
ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం
కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు