Sanjay Raut: ముంబై మూతపడటానికి పది నిమిషాలు చాలు.. సంజయ్ రౌత్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:47 PM
ఠాక్రే సోదరుల మధ్య భిన్న సైద్ధాంతిక విభేదాలున్నా దేశానికి ప్రాధాన్యతనిచ్చి ఐక్యంగా నిలిచారని సంజయ్ రౌత్ అన్నారు. ఠాక్రేలు అంటేనే ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉన్నంత కాలం మరాఠా ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన కుటుంబాల్లో ఒకటైన ఠాక్రేలు ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసినప్పటికీ వారి రాజకీయ ప్రభావం చెక్కుచెదరదని శివసేన (యూబీటీ) సేన సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఠాక్రేలు అనుకుంటే నిమిషాల్లో ముంబై మూతపడుతుందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. 'ఠాక్రేలను తుడిచివేయడం సాధ్యం కాదు. ఇప్పటికీ ఠాక్రేలు అనుకుంటే 10 నిమిషాల్లో ముంబై మూతపడుతుంది' అని అన్నారు.
బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఇటీవల తిరిగి చేతులు కలపడంపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు సోదరులని, వారి తల్లులు అక్కాచెల్లెళ్లని తెలిపారు. ఆ రెండు కుటుంబాలకూ తాను మిత్రుడనని, ఠాక్రే సోదరులు తిరిగి కలవడం వెనుక తన పాత్ర ఉన్నట్లయితే అది తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు. ఠాక్రే సోదరుల మధ్య సైద్ధాంతిక విభేదాల గురించి మాట్లాడుతూ, శివసేన హిందుత్వ ఐడియాలజీ, కాంగ్రెస్ సెక్యులర్ ఐడియాలజీ ఉన్నప్పటికీ కలిసి పనిచేశాయని, అలాగే ఠాక్రే సోదరుల మధ్య భిన్న సైద్ధాంతిక విభేదాలున్నా దేశానికి ప్రాధాన్యతనిచ్చి ఐక్యంగా నిలిచారని అన్నారు. ఠాక్రేలు అంటేనే ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉన్నంత కాలం మరాఠా ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు. ఠాక్రే పార్టీల నుంచే మేయర్ ఉంటారని ముంబై ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. రాజ్, ఉద్ధవ్ వేర్వేరు కాదని, ఒకరేనని, మేయర్ కూడా ఠాక్రే పార్టీల నుంచే ఉంటారని చెప్పారు. ఠాక్రే వర్గాలు ఎప్పటికీ ఏక్‌నాథ్ షిండేతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలిపారు.
ఉత్తుత్తి బెదరింపులే: ఫడ్నవిస్
ఠాక్రే సోదరులు అనుకుంటే నిమిషాల్లో ముంబై మూతపడుతుందంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కొట్టివేశారు. అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని అన్నారు. ఏక్‌నాథ్ షిండేను ముంబైలో అడుగుపెట్టనీయమని అప్పట్లో హెచ్చరించారని, కానీ ఆయన 50 మంది ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్ వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బాల్‌ఠాక్రే బతికి ఉంటే అది (ముంబై మూతపడటం) జరగవచ్చేమో కానీ, వీళ్ల (ఠాక్రే బ్రదర్స్) వల్ల మాత్రం కాదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ శక్తులు ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి.. ప్రధాని మోదీ
సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి