Somath Temple: ఆ శక్తులు ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి.. ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:53 PM
సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారని, ఆలయ విధ్వంసానికి పాల్పడ్డారని, దోచుకున్నారనీ, అయినప్పటికీ ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని మోదీ అన్నారు.
అహ్మదాబాద్: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ (Somnath Temple) పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఆ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఐక్యంగా, బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమనాథ్ ఆలయాన్ని ఆదివారంనాడు ఆయన సందర్శించి పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్నారు.
సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారని, ఆలయ విధ్వంసానికి పాల్పడ్డారని, దోచుకున్నారనీ, అయినప్పటికీ ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. దురాక్రమణదారులు కేవలం చరిత్రలో పేజీలకే పరిమితమయ్యారని, సోమనాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా సమున్నతంగా నిలిచిందని కొనియాడారు. వెయ్యేల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని చెప్పారు. భారతదేశ విశ్వాసానికి స్వాభిమాన్ పర్వ్ ప్రతిబింబమని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఒక గొప్ప జ్ఞాపకమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యానంతరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతినబూనారని, ఆయన చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను కొందరు అడ్డుకున్నారని విమర్శించారు. సోమనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనుకున్నప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. బుజ్జగింపు విధానాలు అనుసరించి కొందరు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రవాద ఆలోచనా విధానం ఉన్న వ్యక్తుల ముందు మోకరిల్లారని, ఇవే శక్తులు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని అన్నారు. ఆ శక్తులను ఓడించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఐక్యమత్యంగా, బలంగా వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.
సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు..
రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి