ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చికెన్ బిర్యానీ.. తమిళనాడులో కొత్త పథకం
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:33 PM
వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించడానికి సీఎం విజయ్ సిద్ధమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు మాంసాహారాన్ని అందించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం విజయ్, విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ కలిసి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఈ పథకం ప్రయోగాత్మక దశలో ఉంది. పేద విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించాలనే ఆలోచనతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన్నట్టు రాజ్ మోహన్ తెలిపారు. అయితే ఉన్నపళంగా దీన్ని ప్రవేశపెట్టదలుచుకోలేదని ఆయన చెప్పారు. భద్రత, శుభ్రతలను పాటిస్తూ ఈ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చనే అవగాహన కోసం తొలుత ఎంచుకున్న కొన్ని పాఠశాలల్లోనే అమలు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. జైలు ఖైదీల కోసం కూడా చికెన్ బిర్యానీని వండి వారుస్తున్నప్పుడు.. చిన్నారుల కోసం వండలేమా అని ప్రశ్నించారు.
జులై నుంచే ప్రణాళిక
ఈ పథకానికి జులై నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలకు చికెన్ బిర్యానీ అందించాలనే ఆలోచన రాగానే మంత్రి రాజ్ మోహన్ సీఎం విజయ్‌కు తెలిపారు. ఆయనకూ ఈ ఆలోచన నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా పేద విద్యార్థులకు ప్రొటీన్లతో కూడిన ఆహారం లభిస్తుందని ఆయన భావించారు. కాగా బిర్యానీ ఉన్న రోజు శాకాహారుల కోసం ప్రత్యేక ఆహారం కూడా ఉండేలా పథకం నమూనా తయారైంది.
భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ
తమిళనాడు ప్రభుత్వం భోజన పథకంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నారు. అత్యంత సురక్షితంగా ఆహారాన్ని తయారు చేస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో జాబితాలో కూడా మార్పులు చేస్తామని, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్నే ఇస్తామని వివరిస్తోంది.
ఈ వార్తలూ చదవండి
పెట్రోల్ కావాలంటే ఇకపై క్యాష్ తీసుకెళ్లాల్సిందే.! ఛార్జీల ప్రకటనతో యూపీఐ సేవలు పరిమితం.?
నందిగ్రామ్ ఉపఎన్నిక.. కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్..