యూపీ ఎమ్మెల్యే బ్యాంకు ఖాతా నుంచి రూ.1.55 లక్షలు మాయం
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:09 PM
యూపీ బీజేపీ ఎమ్మెల్యే పూజా పాల్ బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.1.55 లక్షలు మోసపూరితంగా విత్‌డ్రా అయ్యాయి. గత నెల 22 నుంచి ఈనెల 13 మధ్య ఫోన్ పే, యూపీఐ ద్వారా తనకు తెలియకుండానే పలుమార్లు లావాదేవీలు జరిగినట్లు ఆమె గుర్తించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా చైల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పూజా పాల్ బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.1.55 లక్షలు మాయమయ్యాయి. ఎవరో మోసపూరితంగా ఆ డబ్బును విత్‌డ్రా చేశారు. గత నెల 22 నుంచి ఈనెల 13 మధ్య పలు దఫాల్లో ఫోన్ పే, యూపీఐ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు బాధితురాలు గుర్తించారు. ఈ విషయం ఆమెకు ఈనెల 14న తెలిసింది. తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా, తనకు తెలియకుండానే పలు లావాదేవీలు జరిగినట్లు ఆమె గుర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
22 రోజుల వ్యవధిలో డబ్బు విత్‌డ్రా
పూజా పాల్‌కు ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు తన ఖాతా నుంచి పలుమార్లు డబ్బు విత్‌డ్రా చేసినట్లు పోలీసులకు ఆమె తెలిపారు. తన ఐఫోన్ 17 ఎయిర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉండవచ్చని, తన బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి నగదు ఉపసంహరించి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు సైబర్ సెల్ సహాయంతో ఆమె మొబైల్ ఫోన్, ఫోన్ పే, యూపీఐ, బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలిస్తున్నారు.
అన్ని లావాదేవీలపై దర్యాప్తు చేయండి
ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగిన అన్ని లావాదేవీలపై పూర్తిగా దర్యాప్తు చేయాలని పూజా పాల్.. సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. అలాగే తన మొబైల్ ఫోన్‌కు టెక్నికల్ ఆడిట్ నిర్వహించడంతో పాటు, అన్ని ట్రాన్సాక్షన్ ఐడీలు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో తన ఖాతా నుంచి ఎలాంటి అనధికారిక ఉపసంహరలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మోసపూరితంగా విత్‌డ్రా చేసుకున్న సుమారు రూ.1.55 లక్షలను తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.