రెజినగర్ అభ్యర్థి యూ టర్న్.. పోటీ చేస్తానని మళ్లీ ప్రకటన
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:48 PM
మమతా బెనర్జీ వర్గం తరఫున రెజీనగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నుంచి తప్పుకున్న అభ్యర్థి రబియుల్ ఆలమ్ చౌధరి యూ టర్న్ తీసుకున్నారు. తొలుత ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తానని మూడు గంటల తర్వాత ఆయన ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: మమతా బెనర్జీ వర్గం తరఫున రెజీనగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నుంచి తప్పుకున్న అభ్యర్థి రబియుల్ ఆలమ్ చౌధరి యూ టర్న్ తీసుకున్నారు. తొలుత ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తానని మూడు గంటల తర్వాత ఆయన ప్రకటించారు. మొదట మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయనని చౌధరి చెప్పారు. టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తుపై కొనసాగుతున్న న్యాయపోరాటం కూడా తన నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. మమత వర్గానికి చెందిన కార్యకర్తలను బెదిరిస్తున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. ఇంతలోనే ఆయన యూ టర్న్ తీసుకున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తానని వెల్లడించారు. కాగా.. అంతకుముందు నందిగ్రామ్ ఉపఎన్నిక నుంచి మమత వర్గం అభ్యర్థి సంచితా ప్రధాన్ డే కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
నందిగ్రామ్ ఉపఎన్నికలో ఊహించని మలుపు..
అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉపఎన్నికలో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సంచిత ప్రధాన్ డే .. ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన అనంతరం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మమతా వర్గం.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2007 నాటి హత్య కేసుకు సంబంధించి ప్రధాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మేమే ఫిర్యాదు చేశాం
పోలీసులకు ఫిర్యాదు చేసింది తామేనని డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ నేత రితబ్రత బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం నందిగ్రామ్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న ఈ వర్గం.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయింది. కొద్ది గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నిక పోరు పాత ప్రత్యర్థులు, తిరుగుబాటు వర్గాలు, రాజకీయ పొత్తులతో మరింత సంక్లిష్టంగా మారింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రధాన్‌ను అరెస్టు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, కోర్టు వారంట్ల ఆధారంగానే పోలీసులు చర్యలు తీసుకున్నారని డెమోక్రటిక్ టీఎంసీ పేర్కొంది.
బీజేపీపై రాహుల్ ఫైర్
ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు అని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా, ఎన్నికల్లో తమకు పోటీనే లేకుండా చూసుకోవాలనుకుంటోందని బీజేపీపై ఆయన మండిపడ్డారు. రాహుల్ విమర్శలకు రితబ్రత బెనర్జీ స్పందిస్తూ, ప్రధాన్‌పై ఫిర్యాదు చేసింది తమ డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ వర్గమేనని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు హత్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే అరెస్టు వారంట్ ఉండటంతోనే పోలీసులు ప్రధాన్‌ను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.
వివిధ కేసుల్లో నిందితుడిగా ప్రధాన్
2007లో నందిగ్రామ్‌లో జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో మిలన్ ప్రధాన్ నిందితుడిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆయనపై అరెస్ట్ వారంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు నందిగ్రామ్‌లోని రేయాపారా ప్రాంతంలో ప్రధాన్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
బీజేపీ వణికిపోతోంది: అధిర్
ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ శక్తులు ఒక్కటవుతుండడంతో అధికార పార్టీ ఆందోళనకు గురవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తమ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఇప్పుడు తమ పార్టీకి మద్దతు పెరుగుతున్నట్లు కనిపించడంతో బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. నిరసనకు దిగిన తోటి విద్యార్థులు..
రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న గాజియాబాద్ వ్యాపారులు..