కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ.304.44 కోట్లు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:18 PM
కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను కడప బైపాస్‌తో అనుసంధానించే రహదారి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను కడప బైపాస్‌తో అనుసంధానించే రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిధుల కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కొప్పర్తి-కడప బైపాస్ కనెక్టివిటీ రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొప్పర్తి కీలక ప్రాంతంగా ఉందని తెలిపారు. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు రాకపోకలు, పారిశ్రామిక సరకు రవాణా మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. దీని ద్వారా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీకాకుళం జిల్లాలో బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన