Share News

కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:39 PM

అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగం కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును స్థానిక పోలీసుల ద్వారా కాకుండా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు: సుప్రీంకోర్టు

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగం కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ విరాళాలు దారిమళ్లాయనే ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ కేసును స్థానిక పోలీసుల ద్వారా కాకుండా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ద్వారా విచారణ జరిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును ధర్మాసనానికి సమర్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఎస్‌ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు స్వీకరించి కోర్టుకు తెలియజేస్తామని ఎస్‌జే వెల్లడించారు.


ఈ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని పిటిషనర్లను హెచ్చరించింది. కోర్టులు రాజకీయ వేదికలు కావన్న ధర్మాసనం.. ఈ ఆరోపణలపై నిష్పాక్షికంగా, సమగ్రంగా దర్యాప్తు జరగడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని కోర్టును కోరారు. అలాగే విరాళాలకు సంబంధించిన రసీదులను ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.


ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?

ఫిఫా పోడియంపై ట్రంప్‌ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో

Updated Date - Jul 20 , 2026 | 04:59 PM