Share News

ధైర్యంగా విచారణను ఎదుర్కోండి.. ఎమ్మెల్యే ముందస్తు బెయిలుకు సుప్రీం నిరాకరణ..

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:18 PM

రౌడీ షీటర్ బిక్లు శివ హత్యకేసులో నిందితుడైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ధైర్యంగా విచారణను ఎదుర్కోండి.. ఎమ్మెల్యే ముందస్తు బెయిలుకు సుప్రీం నిరాకరణ..
Byrathi Basavaraj

న్యూఢిల్లీ: రౌడీ షీటర్ బిక్లు శివ హత్య కేసులో నిందితుడైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ (Byrathi Basavaraj)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు తోసిపుచ్చింది. దీనికి బదులుగా రెగ్యులర్ బెయిలుకు వెళ్లాలని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణను ఎదుర్కొనేందుకు ధైర్యం చూపించాలని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు.


'మీరు ప్రజాసేవకులు. మీకు తగినంత ధైర్యం ఉండాలి, విచారణను ఎదుర్కోవాలి. మీకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగలం. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరో తెలియదంటూ మీరు ఎగవేత సమాధానాలు చెబుతున్నారు. మీ కాల్ రికార్డులు మరోలా ఉన్నాయి' అని జస్టిస్ బాగ్జీ ఈ సందర్భంగా అన్నారు.


హలసూరుకు చెందిన రౌడీషీటర్ శివకుమార్ అలియాస్ బిక్లు శివ 2025 జులై 15న హత్యకు గురయ్యాడు. మోటారు సైకిళ్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు అతనిని ఇంటివద్దే హత్య చేశారు. భూమి తగాదాలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టడం వల్లే నిందితులు బిక్లు శివను హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసవరాజ్‌, తక్కిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బసవరాజ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు ఇటీవల నిరాకరించింది. దీంతో ఆయన కోసం కర్ణాటక 'సిట్' అధికారులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 12 , 2026 | 08:18 PM