రాజకీయాలపైనే చర్చించాం... నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:16 PM
ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
న్యూడిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందనే ఊహాగానాలకు తెరపడటం లేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏఐసీసీ సమావేశం కోసం ఢిల్లీ రావడం ఈ ఆసక్తిని మరింత పెంచింది. అయితే ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తెలిపారు.
'దీనిపై (సీఎం మార్పుపై) మేము ఎలాంటి చర్చ జరపలేదు. పార్టీకి ఒక విజన్ అంటూ ఉంది. తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలు తీసుకుంటారు' అని చెప్పారు. ఏఐసీసీ సమావేశంలో ఎవరిని కలిసారని మీడియా అడిగినప్పుడు నేరుగా సమాధానం దాటవేశారు. రాజకీయాల గురించి వీధుల్లో మాట్లాడలేమని చెప్పారు. తాను ఇక్కడకు రాగానే అధిష్టానాన్ని కలిశానని, చాలా విషయాలే మాట్లాడామని, అవన్నీ వెల్లడించలేమని అన్నారు. 'కేవలం గాలి పీల్చుకోవడానికి కాదు, రాజకీయ అంశాలు చర్చించేందుకే ఇక్కడకు వచ్చాను' అని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి డీకే శివకుమార్ ఇటీవల గైర్హాజరయ్యారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీనిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఊహాగానాలకు సీఎం సిద్ధరామయ్య తోసిపుచ్చారు. ఢిల్లీ వెళ్తున్న విషయాన్ని తనకు డీకే తెలియజేసినట్టు చెప్పారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా డీకే ఉన్నారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్