ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:49 AM
తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమెరికా 'ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ' పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీ, జూన్3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. అమెరికా 'ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ' పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక 'ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ' దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది.
ఈ మేరకు తెలంగాణలో 'ప్రిన్స్‌టన్' పేరుతో కాలేజీలు నడుపుతున్న 'వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ'కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ వెబ్‌సైట్లలో అందరికంటే పెద్ద అక్షరాలతో (Largest Font) డిస్‌క్లెయిమర్ నోటీసు ప్రదర్శించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాలేజీ ప్రొస్పెక్టస్, అడ్మిషన్ ఫారాలు, విద్యార్థుల సర్టిఫికెట్లపై తప్పనిసరిగా డిస్‌క్లెయిమర్ ముద్రించాలని స్పష్టం చేసింది. ప్రతి కాలేజీ క్యాంపస్ వెలుపల స్పష్టంగా కనిపించేలా డిస్‌క్లెయిమర్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నూతన విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపే నిబంధనలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని డెడ్‌లైన్ విధించింది. అంతర్జాతీయ బ్రాండ్ల పేరుతో విద్యార్థులు అయోమయానికి గురికాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. పేరు మార్పుపై ప్రధాన కేసు ఇంకా ఢిల్లీ హైకోర్టులోనే పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News