ఆ దృశ్యం.. జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చింది: సునీతా విలియమ్స్
ABN , Publish Date - Jan 21 , 2026 | 06:40 PM
అంతరిక్షయానం తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌పేర్కొన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్’ అనే అంశంపై మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుమార్లు అంతరిక్షయానం చేసిన ఆమె.. తాజాగా తన స్పెస్ టూర్ అనుభవాలను పంచుకున్నారు. స్పెస్ జర్నీ తన జీవితంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ఆమె పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు.. జీవితం పట్ల తన దృక్పథం మారిందని తెలిపారు. పలు విషయాల్లో మనుషుల మధ్య విభేదాలు, గొడవలు పడటం చాలా సిల్లీగా అనిపిస్తుందన్నారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్’ అనే అంశంపై ప్రసంగించారు.
‘మనం అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటారు. నేను కూడా అంతే. నా తండ్రి భారత్‌కు చెందిన వారు.. తల్లి స్లోవేనియా వ్యక్తి. అందుకే మొదట ఈ ప్రాంతాల గురించే చూశా. మొదట మనం ఉండే ప్రాంతం కోసం వెతికినా.. చివరకు భూమి అంతా ఒకటేనని తెలుసుకుంటాము. సముద్రాలు, మారుతున్న కాలాలు, ధృవాలు.. ఇలా అంతరిక్షం నుంచి భూ గ్రహాన్ని చూసినప్పుడు జీవితం పట్ల ఆలోచనా ధోరణి మారుతుంది. మనుషుల మధ్య విభేదాలపై మనకు ఉండే అభిప్రాయాన్ని మారుస్తుంది. మనమంతా ఒక్కటే కదా.. కలిసి మెలసి ఉండాలనే భావనను కలిగిస్తుంది. అదేవిధంగా ఓ ఇల్లాలిగా కుటుంబంలో గొడవలను గురించి అర్థం చేసుకుంటా. నాకు, నా భర్తకు మధ్య వాదనలు జరుగుతుంటాయి. కానీ, అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి’ అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు.
సునీతా విలియమ్స్ నాసా (NASA)లో దాదాపు మూడు దశాబ్దాలు పనిచేశారు. 2025 డిసెంబర్ 27న పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మూడుసార్లు అంతరిక్షయానం చేసిన ఆమె.. 608 రోజులు స్పెస్ సెంటర్‌లో ఉండి సుదీర్ఘ కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు. నాసా వ్యోమగాములలో అంతరిక్షంలో గడిపిన మొత్తం సమయం పరంగా ఆమె రెండవ స్థానంలో ఉన్నారు. ఒక అంతరిక్ష యాత్రలో ఎక్కువ రోజులు గడిపిన వారి జాబితాలో నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో సమానంగా ఆమె ఆరవ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ నాసా మిషన్‌లో 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ భారత్ పర్యటనలో ఉన్నారు.
Also Read:
యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదు.. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరంలో ట్రంప్
సావెరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారి పంట పండిది.. లక్షకి.. రూ. 3.64 లక్షలు