Share News

భారత్ నా ఇల్లు.. వదిలి వెళ్లలేకపోయా: సోనియా గాంధీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:34 PM

రాజీవ్ గాంధీ హత్య తర్వాత తీవ్ర మానసిక వేదన అనుభవించిన రోజుల్లో ఇటలీకి తిరిగి వెళ్లాలని తన సోదరి సూచించారని సోనియా గాంధీ వెల్లడించారు. కానీ భారత్‌ను తన ఇల్లుగా భావించి వదిలి వెళ్లలేకపోయానని 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

భారత్ నా ఇల్లు.. వదిలి వెళ్లలేకపోయా: సోనియా గాంధీ
Sonia Gandhi's Grief After Rajiv's Death

ఇంటర్నెట్ డెస్క్: భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో తన ప్రపంచమే కుప్పకూలిపోయిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ విషాదం నుంచి తేరుకోలేక తీవ్ర మానసిక వేదన అనుభవించిన రోజుల్లో ఇటలీకి తిరిగి వెళ్లిపోవాలని తన సోదరి సూచించారన్నారు. అయితే.. భారత్‌ను వదిలేసి పోవడం తనవల్ల కాలేదని చెప్పుకొచ్చారు. 'భారత్‌ నా ఇల్లు.. నా పిల్లల ఇల్లు కూడా' అని భావోద్వేగమయ్యారామె. తన జ్ఞాపకాలతో రాసిన 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకం విడుదల సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.


1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈకి చెందిన మహిళా ఆత్మాహుతి దాడిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో రాజీవ్‌ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భర్త మరణంతో సోనియా తీవ్ర విషాదంలో మునిగిపోయారని కుమార్తె ప్రియాంక గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో తల్లి గంటల తరబడి చీకటి గదిలోనే కూర్చుని మొజార్ట్‌ సంగీతంలోని 'రిక్వియమ్‌' వింటూ గడిపేవారన్నారు. 'నన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్లిపోయావు?' అంటూ తల్లి కన్నీటితో ప్రశ్నించేవారని చెప్పారు ప్రియాంక.

Sonia Gandhi with Rajiv Gandhi.jpg


రాజీవ్‌ హత్యకు ముందు ఆయనకు ముప్పుపొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలను గుర్తించినట్లు తాను తర్వాత తెలుసుకున్నానని సోనియా తెలిపారు. ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదని.. ఇకపైనా అసలు నిజం బయటపడుతుందని కూడా తాను అనుకోవట్లేదని పేర్కొన్నారు.


ఇటలీ నుంచి భారత రాజకీయాల్లోకి..

ఇటలీలో జన్మించిన సోనియా 1968లో రాజీవ్‌గాంధీని వివాహం చేసుకుని భారత్‌కు వచ్చారు. తొలినాళ్లలో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. భర్త హత్య తర్వాత క్రమంగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1998లో కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ 2004 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే.. ప్రధానమంత్రి పదవిని స్వీకరించేందుకు ఆమె నిరాకరించారు.


ఇవీ చదవండి:

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ

ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారు.. తన ఆత్మకథలో వెల్లడించిన సోనియా గాంధీ

Updated Date - Nov 10 , 2026 | 02:42 PM