వారిని విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష.. కేంద్రానికి వాంగ్‌చుక్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:24 PM
నిరసనకారులను, నాయకులను అరెస్ట్ చేయడాన్ని వాంగ్‌చుక్ ఖండించారు. ఈ పరిస్థితి ప్రకటించని ఎమర్జెన్సీలాగా ఉందని ధ్వజమెత్తారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను, నిరసనకారులను 24 గంటల్లో విడుదల చేయాలని, లేకపోతే తాను నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు.. ఇందులో పాల్గొన్న నాయకులు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా నిరసనకారులను అరెస్ట్ చేయడాన్ని వాంగ్‌చుక్ ఖండించారు. ఈ పరిస్థితి ప్రకటించని ఎమర్జెన్సీలాగా ఉందని ధ్వజమెత్తారు.
ఇప్పటివరకు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్‌లను వాంగ్‌చుక్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘నిరసనకు చాలా మంది రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వటం నాకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ నాయకులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇప్పుడే తెలిసింది. వీరందరినీ ప్రభుత్వం రేపటిలోగా విడుదల చేయాలి. లేనిపక్షంలో నేను నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేస్తాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేసిన సంగతి విదితమే.
ఈ వార్తలూ చదవండి
నిరసనలో పాల్గొన్న మమత, కేజ్రీవాల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల లేఖ.