'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల లేఖ..
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:01 PM
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల చోరీ జరిగాయంటూ చేసే ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలని వారు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల చోరీ జరిగాయంటూ చేసే ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలని వారు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇండియా కూటమి నేతలు, కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తున్న వేళ మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవాళ్లం కాదని మాజీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల రూపకల్పన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాల్లో తమకు ప్రత్యక్ష అనుభవం ఉందని వివరించారు. గతంలో బూత్‌ల ఆక్రమణ, బ్యాలెట్ బాక్సుల చోరీ, ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి అక్రమాలు జరిగేవని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణలో పలు భద్రతా చర్యలు అమలవుతున్నాయని మాజీ అధికారులు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తారని వివరించారు.
ఈవీఎంలను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి, పర్యవేక్షణకు వీలుగా భద్రపరుస్తారని తెలిపారు. అలాగే, వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంల లెక్కలతో సరిపోల్చే విధానం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక్క చోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయని, 1951 తర్వాత అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని తెలిపారు. మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అమలవుతున్న పర్యవేక్షణ, భద్రతా చర్యల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కుట్ర జరిగినట్లు నిరూపించే ఆధారాలు లేవని మాజీ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలపై ఆరోపణలు చేసేవారు అందుకు తగిన ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. కాగా, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన పలువురు ప్రతిపక్ష నేతలను నేడు ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల లేఖ చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
భూమిని తాకనున్న సౌర తుఫాను.. అక్టోబర్ 11న ఏం జరగనుంది..?
రాహుల్ గాంధీతో విజయ్ భేటీ.. కేఫ్‌లో కాఫీ, తిరమిసు.. అభిమానులతో సెల్ఫీలు..