Share News

పెళ్లి కోసం 21 ఏళ్లు వచ్చే వరకూ ఆగాలన్నందుకు తండ్రి హత్య...

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:07 PM

‘నీకు ఇప్పుడు 18 ఏళ్లు. పెళ్లి చేసుకోవడానికి చట్ట ప్రకారం 21 ఏళ్లు నిండాలి. అప్పటి వరకూ ఆగు’ అని చెప్పడమే ఆ తండ్రి పాలిట శాపమైంది.

పెళ్లి కోసం 21 ఏళ్లు వచ్చే వరకూ ఆగాలన్నందుకు తండ్రి హత్య...
Nitin Singh

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు వచ్చే వరకూ ఆగాలని చెప్పినందుకు ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కన్న తండ్రిని తుపాకీతో కాల్చి హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. నితిన్ సింగ్ అనే వ్యక్తి చండీగఢ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా కొన్ని రోజుల నుంచి ప్రియురాలితో తనకు పెళ్లి చేయాలని అతడు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకోవడానికి చట్టరీత్యా 21 ఏళ్లు ఉండి తీరాలని వారు చెప్పారు. తగిన వయసు వచ్చేంత వరకూ ఆగాలని సూచించారు. దీనిపై గత గురువారం తండ్రి, కుమారుడి మధ్య వాగ్వాదం జరిగింది. తనకు ఇప్పుడే పెళ్లి చేయాలని బాలుడు పట్టుబట్టాడు. తన ప్రియురాలిని ఇంటికి తీసుకువస్తానని, తనకు డబ్బులివ్వాలని అతడు డిమాండ్ చేశాడు. తండ్రి ఎంతకీ అంగీకరించకపోయే సరికి ఆగ్రహాన్ని గురైన అతడు.. తుపాకీతో నితిన్ సింగ్‌ను షూట్ చేశాడు.


కాగా శుక్రవారం నితిన్ సింగ్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆయన తలలో బులెట్ దిగినట్టు గుర్తించారు. దర్యాప్తు చేపట్టి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తండ్రితో పాటు తల్లిపై కూడా అతడు దాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆమె తప్పించుకుని కేకలు వేయగా స్థానికులు వచ్చి కాపాడారని పేర్కొన్నారు. తండ్రి హత్యను బయటి వ్యక్తులు చేసినట్టు చిత్రీకరించాలని బాలుడు భావించాడని వెల్లడించారు. కన్న తండ్రినే హత్య చేసిన అతడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని పోలీసులు చెప్పారు.


ఆ బాలుడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు ఉండడం గమనార్హం. ఓ కారు నిర్లక్ష్యంగా నడిపి ఇద్దరు సోదరుల ప్రాణాలను అతడు బలి తీసుకున్నాడు. ఆ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చిన బాలుడు.. ఇప్పుడు తండ్రినే కడతేర్చాడు.


ఇవీ చదవండి

కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి.. గురుగ్రామ్‌లో విద్యార్థుల ఘర్షణ

గజియాబాద్‌లో విషాదం.. 12వ అంతస్తు నుంచి పడి జాతీయస్థాయి ఛాంపియన్ మృతి..

Updated Date - Sep 26 , 2026 | 02:44 PM