Share News

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుంది: కల్వకుంట్ల కవిత ప్రకటన

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:31 PM

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుంది: కల్వకుంట్ల కవిత ప్రకటన
Khairatabad By Election

హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ పార్టీ మార్పు అంశంపైనా ఆమె స్పందించారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపైనా కవిత స్పందించారు. క్లరికల్ తప్పిదాల కారణంగా అధికారులు ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. బీజేపీ ప్రోత్సాహంతో కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే చర్చ ప్రజల్లో ఉందని కవిత పేర్కొన్నారు.


ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటన బాధాకరం..

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు అత్యంత బాధాకరమని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు సరిగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రుల్లో మంత్రులు ఫోన్ చేసినా బెడ్లు దొరకని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. పదకొండు రకాల ఆరోగ్య పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించలేదని కవిత ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలనూ ఇప్పటికీ విడుదల చేయలేదని మండిపడ్డారు.


పిల్లలు చనిపోతుంటే సింగపూర్ ఎలా చేస్తారు..

ప్రభుత్వ ఆస్పత్రులను మంత్రులు పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ప్రభుత్వ హాస్టళ్లు, ఆస్పత్రులను ఆయా జిల్లాల కలెక్టర్లు క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. ప్రతి జిల్లాలో తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రభుత్వ వైద్యశాలలను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. ఇంతమంది చిన్నారులు మరణిస్తుంటే తెలంగాణను డల్లాస్, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ఎలా చెబుతారని సీఎం, మంత్రులను ప్రశ్నించారు. మరోవైపు, ఐటీడీఏకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో 70 శాతం వినియోగించలేదని కవిత ఆరోపించారు. కోఠి ఆస్పత్రిలో మిడ్‌డే మీల్స్ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతించలేదని పేర్కొన్నారు.


నా ఫామ్‌హౌస్‌ కబ్జా భూమిలో లేదు..

తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. అక్కడ ఎలాంటి అక్రమ భూములు లేవని, ఇనాం, కబ్జా లేదా అసైన్డ్ భూమి లేదని చెప్పారు. తన ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని, తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ద్వారా అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పక్కాప్లాన్‌తో ప్రశాంతంగా గణపతుల నిమజ్జన ప్రక్రియ: సీపీ సజ్జనార్

రేషన్‌ ఈకేవైసీకి అక్టోబరు నెలాఖరు వరకు గడువు.. మొబైల్‌తోనే పూర్తి చేసే అవకాశం

Updated Date - Sep 26 , 2026 | 03:20 PM