గజియాబాద్‌లో విషాదం.. 12వ అంతస్తు నుంచి పడి జాతీయస్థాయి ఛాంపియన్ మృతి..
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:13 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సీబీఎస్‌ఈ రోప్ స్కిప్పింగ్ నేషనల్ ఛాంపియన్ ప్రాచీ భవనం పైనుంచి పడి మృతిచెందింది.
గజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సీబీఎస్‌ఈ రోప్ స్కిప్పింగ్ నేషనల్ ఛాంపియన్ ప్రాచీ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడి మృతిచెందింది. ఆరబెట్టిన బట్టలు తీసేందుకు వెళ్లి 12వ అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలకు రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని రాజ్‌నగర్ రెసిడెన్సీ సొసైటీలో జరిగింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతిచెందిన బాలిక పేరు ప్రాచీ (14). ఆమె సంజయ్ నగర్‌లోని డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఆరబెట్టిన బట్టలు తీసుకునేందుకు బాల్కనీలోకి వెళ్లిన బాలిక.. ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రాచీ కిందపడిన శబ్దం వినిపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నంద్‌గ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బాలిక మృతికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ, కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.
కాగా, ఇటీవల షిర్డీలో జరిగిన సీబీఎస్‌ఈ రోప్ స్కిప్పింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ప్రాచీ రెండు బంగారు పతకాలు సాధించింది. ‘డబుల్ డచ్ పెయిర్ ఫ్రీస్టైల్’, ‘డబుల్ డచ్ సింగిల్ ఫ్రీస్టైల్’ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఈ విజయంతో ఇటీవలే ఆమె గజియాబాద్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు ఈ ఆనందంలో ఉండగానే ప్రాచీ మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ వార్తలు కూడా చదవండి
లుధియానాలో ఘోర ప్రమాదం.. ఆరు వాహనాలను ఢీకొట్టిన టియాగో ఈవీ..
డజను మంది ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై దుమారం..