Share News

డజను మంది ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై దుమారం..

ABN , Publish Date - Sep 26 , 2026 | 10:58 AM

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు అభివృద్ధి, నగరానికి వలసల గురించి సీఎం ప్రస్తావిస్తూ బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లరని, వారు రెండు వివాహాలు చేసుకుని ఇక్కడే స్థిరపడతారని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

డజను మంది ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై దుమారం..
Karnataka CM DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులో పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ, కరవు పరిస్థితులపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బెంగళూరు అభివృద్ధి, నగరానికి వలసల గురించి సీఎం ప్రస్తావించారు. ‘బెంగళూరును కెంపేగౌడ నిర్మించారు. కెంగల్ హనుమంతయ్య విధానసౌధను నిర్మించారు. బెంగళూరును ఎస్.ఎం.కృష్ణ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్లడం లేదు. న్యాయవాదులు సహా అందరూ ఇక్కడే స్థిరపడుతున్నారు’ అని పేర్కొన్నారు.


అనంతరం ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ.. ‘బెంగళూరుకు వచ్చే మీరు (ఎమ్మెల్యేలు) కూడా తిరిగి వెళ్లరు. నగరానికి వచ్చే వారందరికీ రెండు పెళ్లిళ్లు అవుతాయి. అలాంటి వాళ్లు డజను మంది ఉన్నారు. నేను మీకు ఆ జాబితా ఇవ్వగలను’ అని అన్నారు. ధార్వాడ, దక్షిణ కన్నడ తదితర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, అయితే వారి గురించి సభలో ప్రస్తావించబోనని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్.అశోక తీవ్రంగా స్పందించారు. సభలో అలాంటి మాటలు అవసరం లేదన్నారు. సీఎం పేర్కొన్న ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. శివకుమార్ వ్యాఖ్యలతో ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేపైనా అనుమానం ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.సురేశ్ కుమార్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలను సరదాగా చేసి ఉండవచ్చని, కానీ అసెంబ్లీ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు సభ గౌరవాన్ని పెంచవని అన్నారు. రెండు వివాహాలు చేసుకుని రెండు కుటుంబాలను నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పిన ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని ఆయన కోరారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలనూ అనుమానంగా చూడటం, ఎగతాళి చేసే పరిస్థితి ఏర్పడవచ్చని సురేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ట్రంప్‌నకు ఇరాన్ కీలక ప్రతిపాదన.. ఏడు రోజుల కాల్పుల విరమణకు రెడీ

లుధియానాలో ఘోర ప్రమాదం.. ఆరు వాహనాలను ఢీకొట్టిన టియాగో ఈవీ..

Updated Date - Sep 26 , 2026 | 11:38 AM