లుధియానాలో ఘోర ప్రమాదం.. ఆరు వాహనాలను ఢీకొట్టిన టియాగో ఈవీ..
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:06 AM
పంజాబ్‌లోని లుధియానాలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. బహదూర్‌కే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన టాటా టియాగో ఈవీ అదుపుతప్పి వరుసగా ఆరు వాహనాలను ఢీకొట్టింది.
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. బహదూర్‌కే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన టాటా టియాగో ఈవీ అదుపుతప్పి వరుసగా ఆరు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
బహదూర్‌కే రోడ్డుపై వాహనాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. అయితే, ఓ టాటా టియాగో ఈవీ అత్యంత వేగంతో దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న సైకిల్, మోటార్‌సైకిల్ సహా పలు వాహనాలను ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి పలుమార్లు పల్టీలు కొట్టాడు. అనంతరం రోడ్డుపై సుమారు 30 అడుగుల దూరంలో పడిపోయాడు. అలాగే ముందుకు దూసుకెళ్లిన కారు.. మరో రెండు ఈ-రిక్షాలు, ఓ యాక్టివా స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
అయితే, తమ వాహనాలను ఢీకొన్న సమయంలో కారు గంటకు సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని బాధితులు తెలిపారు. అంతేకాకుండా డ్రైవర్ మద్యం సేవించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సలీం టాబ్రీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
ట్రాఫిక్ రద్దీలో టీనేజర్ల విన్యాసాలు.. తల్లిదండ్రులపై చర్యలకు సిద్ధమైన పోలీసులు