Share News

రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:34 PM

విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.

రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్
Shashi Tharoor

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు. అయితే అవి ప్రజల్లో అదే స్థాయిలో స్పందన పొందలేకపోయాయని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమంపై స్పందించిన థరూర్.. ఆ పార్టీ లేవనెత్తిన అనేక అంశాలను రాహుల్ గాంధీ తన 'ఛాత్రోన్ కీ గూంజ్'లో ముందుగానే ప్రస్తావించారని తెలిపారు. 'సీజేపీ లేవనెత్తిన అంశాలను మా పార్టీతో పాటు రాహుల్ గాంధీ ముందే ప్రస్తావించారు. అయితే అవి ఎందుకు అంతగా ప్రజల్లోకి వెళ్లలేకపోయాయనే విషయాన్ని పరిశీలించాలి. ప్రజల నాడి ఏంటో తెలుసుకోవాలి' అని థరూర్ అన్నారు.


కాగా.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జూన్ 20న సీజేపీ విద్యార్థి ఆందోళనలు ప్రారంభించగా.. అంతకుముందు అనగా జూన్ 17న రాజస్థాన్‌లోని కోటాలో రాహుల్ గాంధీ 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దేశ విద్యా వ్యవస్థలో అవినీతి, అన్యాయ ధోరణులు పెరిగాయని రాహుల్ ఆరోపించినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. సీజేపీ ఉద్యమానికి వచ్చినంత ప్రజా మద్దతు తమ కార్యక్రమానికి రాలేదని థరూర్ వ్యాఖ్యానించారు.


దేశ రాజకీయాల్లో యువత పాత్ర మరింత పెరగబోతోందని ఈ సందర్భంగా శశిథరూర్ అన్నారు. 2029 ఎన్నికల్లో జన్ జెడ్ ఓటర్లు కీలకంగా మారతారని పేర్కొన్నారు. 'యువత మార్పును కోరుకుంటోంది. పాత తరహా రాజకీయాలతో ముందుకు సాగలేం. దక్షిణాసియాలోని రాజకీయ వ్యవస్థలు యువత ఆలోచనలను అర్థం చేసుకోవాలి' అని ఆయన చెప్పారు. పార్టీలో ఉంటూనే తన స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని మరోసారి స్పష్టం చేశారు థరూర్. 'నేను నా పార్టీకి విధేయుడినే. కానీ నా అభిప్రాయాలను చెప్పడం కొనసాగిస్తాను. కొన్నిసార్లు నా వ్యాఖ్యలను ప్రత్యర్థులూ ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలి' అని తెలిపారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పాల్గొన్న కార్యక్రమానికి హాజరుకావడంతో తనపై వచ్చిన విమర్శలపై థరూర్ స్పందిస్తూ.. వేర్వేరు అభిప్రాయాలున్న వ్యక్తులతో ఒకే వేదికను పంచుకోవడం ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.


ఇవీ చదవండి:

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

Updated Date - Aug 07 , 2026 | 07:37 PM