లాస్ ఏంజెలెస్ మేయర్ నిత్యకు శశిథరూర్ కంగ్రాట్స్
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:53 AM
లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ నిత్యా రామన్ ఎన్నికవడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ లో అభినందించారు. అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను కూడా ఆయన ప్రస్తావించారు.
ఇంటర్నెట్ డెస్క్: లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ నిత్యా రామన్ ఎన్నికవడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ లో అభినందించారు. అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికాలోని రెండు పెద్ద నగరాలకు భారత సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని ఆయన కొనియాడారు. ‘తిరువనంతపురం బిడ్డ నిత్యా రామన్ ఇప్పుడు లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత్‌లో ఉన్న మేయర్ల కన్నా మమ్దానీ, నిత్య గొప్పగా పనిచేస్తారని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో ఉన్న మేయర్ల వ్యవస్థపైనా ఆయన పలు విమర్శలు చేశారు. భారతదేశంలో ఉన్న మేయర్లు బ్రిటిష్ కాలం నాటి పాత వ్యవస్థ వల్ల ఎలాంటి అధికారం, బడ్జెట్ లేక నిస్సహాయులుగా మిగిలిపోయారని పేర్కొన్నారు.
కాగా.. భారత సంతతికి చెందిన, డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా మద్దతు ఉన్న సిటీ కౌన్సిలర్ నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌ను ఆమె ఓడించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో నిత్యా రామన్‌కు తిరుగులేని ఆధిక్యం వచ్చింది. దీంతో బాస్ తన ఓటమిని అంగీకరించారు. ఇక లాస్ ఏంజెలెస్ 44వ మేయర్‌గా నిత్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌లో వెల్లడించారు. తనను మేయర్‌గా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ముందున్న పనులు కఠినమైనవని, మార్పు రావడానికి సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఎవరీ నిత్యా రామన్?
నిత్యా రామన్ 1981లో కేరళలో జన్మించారు. తనకు ఆరేళ్లు ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. తొలుత లూసియానాలో, తర్వాత మసాచుసెట్స్‌లో నివసించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2008లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం న్యూఢిల్లీలో పట్టణ పేదరికంపై కొన్నాళ్లు పనిచేశారు. 2020లో అప్పటి లాస్ ఏంజెలెస్ కౌన్సిలర్ డేవిడ్ ర్యూను ఓడించి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. దీంతో లాస్ ఏంజెలెస్ నగర కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2024లో మరోసారి ఎన్నికై రెండోసారి కౌన్సిలర్‌గా కొనసాగారు.
మమ్దానీ వంటి నేతల మద్దతు
జూన్‌లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో రియాలిటీ టీవీ స్టార్ స్పెన్సర్ ప్రాట్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి నవంబర్‌లో జరిగిన తుది పోటీకి నిత్యా రామన్ అర్హత సాధించారు. ఈ ఎన్నికల్లో కరెన్ బాస్‌కు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మద్దతు తెలిపారు. నిత్యా రామన్‌కు ప్రగతిశీల రాజకీయ సంఘాల నుంచి మద్దతు లభించింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వంటి నేతలు కూడా ఆమెకు మద్దతు తెలిపారు.
నిత్యా రామన్ హామీలు..
నగర పోలీసు విభాగంలో మార్పులు తీసుకురావాలని నిత్యా రామన్ భావిస్తున్నారు. ఫెడరల్ వలసల అమలు విషయంలో పోలీసు చీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు చీఫ్‌ను మారుస్తానని హామీ ఇచ్చారు. నగరంలో మౌలిక సేవలను మెరుగుపరచడంతో పాటు రహదారులు, వీధి దీపాల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అలాగే నిరాశ్రయుల సమస్య పరిష్కారానికి వైద్యసేవల బృందాలను విస్తరిస్తానని పేర్కొన్నారు. వీధుల్లో, తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్న వారికి వైద్య సహాయం అందించడంతో పాటు అద్దెకు తీసుకున్న హోటల్ గదుల్లో ఉంటున్న వారిని శాశ్వత నివాసాలకు తరలించాలని భావిస్తున్నారు. 2028లో లాస్ ఏంజెలెస్‌లో ఒలింపిక్స్ జరిగే నాటికి వీధుల్లో గుడారాలు, తాత్కాలిక శిబిరాల్లో నివసించే వారి సంఖ్యను కనీసం సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..
అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత