200 మంది యూత్ కాంగ్రెస్ నేతలపై వేటు!
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:27 AM
ఢిల్లీలో ఈనెల ఒకటో తేదీన ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీకి రాలేదన్న కారణం చూపించి దాదాపు 200 మంది యూత్ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది
‘ఇండియా’ ర్యాలీకి రాలేదని
తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల నాయకుల సస్పెన్షన్
న్యూఢిల్లీ, నవంబరు 5: ఢిల్లీలో ఈనెల ఒకటో తేదీన ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీకి రాలేదన్న కారణం చూపించి దాదాపు 200 మంది యూత్ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. దాదాపు ఏడు రాష్ట్రాలకు చెందిన 200 మంది యూత్ కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేసినట్లు వారికి నోటీసులు పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వేటుపడిన వారిలో తెలంగాణకు చెందిన 14 మంది ఉన్నారు. అయితే.. వివరణ కూడా అడగకుండా తమపై వేటు వేయడంపై ఆయా నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం తాము చేపట్టిన కార్యక్రమాలు, చేసిన సేవలు అన్నింటినీ కాదని ఒక్క కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని కారణంగా చూపి వేటు వేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నాం. జైళ్లకు వెళ్లాం. కానీ ఒక్క కార్యక్రమానికి రాలేదని సస్పెండ్ చేస్తారా?’ అంటూ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రోహిత్ రాజోరియా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వేటు వేశారని పేర్కొన్నారు. తన సమీప బంధువు చనిపోవడంతో ఆ రోజు ఆందోళనకు హాజరుకాలేకపోయానని ఆయన తెలిపారు.