Share News

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

ABN , Publish Date - Nov 05 , 2026 | 08:14 PM

అదుపులోకి తీసుకున్న వ్యక్తులను న్యాయస్థానాల ముందు హాజరుపరిచేందుకు రాజ్యాంగం విధించిన 24 గంటల గడువుపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది.

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

ఇంటర్నెట్ డెస్క్: అదుపులోకి తీసుకున్న వ్యక్తులను న్యాయస్థానాల ముందు హాజరుపరిచేందుకు రాజ్యాంగం విధించిన 24 గంటల గడువుపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ఈ 24 గంటల డెడ్‌లైన్ ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది. అంతేకానీ ఆ వ్యక్తిని అధికారికంగా అరెస్ట్ చేసిన సమయం నుంచి గడువును లెక్కించకూడదని వివరించింది. ‘అధికారికంగా అరెస్ట్ జరిగినప్పటి నుంచే 24 గంటల గడువు మొదలవుతుందని భావించటం తగదు. భారతీయ న్యాయసంహిత ప్రకారం అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డైడ్‌లైన్‌ను లెక్కించాలి. ఇది పూర్తయ్యేలోపు కచ్చితంగా అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా 24 గంటల గడువు విషయంలో ఒరిస్సా, మద్రాస్, కేరళ హైకోర్టుల గత తీర్పులను సుప్రీం తప్పుబట్టింది. అధికారికంగా అరెస్ట్ జరిగిన క్షణం నుంచే డెడ్‌లైన్ ప్రారంభవుతుందని ఆ హైకోర్టులు మునుపు అభిప్రాయపడ్డాయి. ఈ అభిప్రాయాలను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.


కాగా సుజిత్‌దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మాదకద్రవ్యాల రవాణా కేసులో త్రిపురలో గతేడాది సెప్టెంబర్ 29 మధ్యాహ్న సమయంలో సుజిత్‌దాస్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అయితే అక్కడి పోలీసులు సెప్టెంబర్ 30న అతడి అరెస్ట్‌ను అధికారికంగా నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు ముందు సుజిత్‌ను హాజరుపరిచారు. దీన్ని నిందితుడి తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. కావాలనే పోలీసులు అరెస్ట్ సమయాన్ని తప్పుగా చూపిస్తున్నారని వారు వాదించారు. మరోవైపు అరెస్ట్ చేసినప్పుడే 24 గంటల డైడ్‌లైన్ వర్తిస్తుందని దర్యాప్తు సంస్థలు ప్రతి వాదనలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు గడువుపై స్పష్టతనిచ్చింది.


ఈ వార్తలూ చదవండి

గదిలో కూతురితో సన్నిహితంగా ఉద్యోగి.. అది చూసిన యజమాని..

మిమ్మల్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఎందుకు? ఐఏఎస్‌పై వ్యక్తి ఫైర్

Updated Date - Nov 05 , 2026 | 08:31 PM