శశి థరూర్ పోస్ట్‌లో గ్రామర్ మిస్టేక్.. నెటిజన్ల షాక్
ABN , Publish Date - Sep 19 , 2026 | 07:16 AM
‘ప్రమాదో ధీమతామపి’ అని లోకోక్తి ఉంది. అంటే పండితులు కూడా పొరపాట్లు చేస్తారనేది దానర్థం. ఇప్పుడు ఈ మాటను నిరూపించే చిన్న ఘటన కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ విషయంలో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా తప్పులు చేస్తారు. ఇప్పుడు అలాంటి చిన్న ఘటనే ఒకటి జరిగింది. ఆంగ్ల భాషపై చక్కటి పట్టున్న కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోస్ట్‌లో ఓ వ్యాకరణ తప్పిదం దొర్లింది. గురువారం ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా థరూర్ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ పోస్ట్‌లో ‘ఆన్ హిజ్ బర్త్‌డే’కు బదులుగా ‘ఇన్ హిజ్ బర్త్‌డే’ అని రాశారు. అంటే ‘ఆన్’ ప్రిపొజిషన్ రాయాల్సిన చోట ‘ఇన్’ రాశారన్నమాట. అది చిన్నతప్పిదమే అయినా చేసింది శశి థరూర్ కాబట్టి దానిపై చర్చ జోరందుకుంది.
కొంతమంది నెటిజన్లు ఈ గ్రామర్ మిస్టేక్‌ను గమనించి ఎక్స్‌లో కామెంట్లు పెట్టారు. ‘బాబోయ్.. శశి థరూర్ లాంటి వాళ్లు కూడా గ్రామర్‌లో తప్పులు చేస్తున్నారు’ అని అంటున్నారు. ఆ తరువాత థరూర్ కూడా దీనిపై స్పందించారు. తన పొరపాటును అంగీకరించి.. ‘అవును ఆన్ స్థానంలో ఇన్ వచ్చింది. ఇలా ఎప్పుడూ జరుగుతోంది’ అని పోస్ట్ చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఓ వ్యక్తి దీనిని 'గ్లిచ్ ఇన్ ది మ్యాట్రిక్స్ (అత్యంత అరుదుగా జరిగే దోషం)'గా వ్యవహరించారు. మరోవ్యక్తి ఇలాంటిది మళ్లీ జరగదని, కాబట్టి ఫ్రేమ్ కట్టించుకుని దీన్ని దాచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంకో వ్యక్తి ‘నాకొకటి అర్థమైంది. ఇంగ్లీష్‌లో నాబోటి వారు తప్పులు చేయడం తప్పు కాదు. ఎందుకంటే శశి థరూర్ లాంటి వారే చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
హైవేలపై పశువులు తిరిగితే యజమానులకు ఫైన్
మైనర్ల పాస్‌పోర్టు 18 ఏళ్లు నిండేవరకూ చెల్లుబాటు