Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరీ కేసు.. కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:58 AM
శబరిమల బంగారం చోరీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు ఉన్నికృష్ణన్, దేవశ్వం బోర్డు మాజీ ప్రెసిడెంట్ పద్మకుమార్‌కు సంబంధించిన పలు చోట్ల రెయిడ్స్ నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ఈడీ నేడు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. మొత్తం 21 చోట్ల సోదాలను ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్, దేవశ్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. నిధులను మళ్లించిన తీరు, లబ్ధిదారులు ఎవరో తేల్చే దిశగా ఆధారాలు సేకరించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, ఈ కేసుపై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా విచారణను ముమ్మరం చేసింది. శబరిమల ఆలయ సన్నిధానంలోని బంగారు తాపడాల నాణ్యతను పరీక్షించేందుకు త్వరలో శాంపిల్స్‌ను సేకరించనుంది (ED Raids in Sabarimala Gold Theft Case).
శబరిమల ఆలయ తాపడాల పునరుద్ధరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ కూడా పీఎమ్ఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టింది. బంగారం చోరీకి సంబంధించి దేవశ్వం బోర్డు అధికారులు, మధ్యవర్తులు, జువెలర్స్ కలిసి భారీ కుట్రకు తెరలేపినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆలయంలోని బంగారు తాపడాలను రాగి తాపడాలుగా రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయించి గోల్‌మాల్‌కు తెరతీసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. నిజానిజాలు తేల్చేందుకు సంబంధిత విభాగాల అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి:
పాక్‌లో చిక్కుకుపోయిన భారతీయ మహిళ! తిరిగొచ్చేస్తానంటూ వేడుకోలు
కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం