CBI Reinvestigates: కరూర్ దుర్ఘటనపై మరోసారి సీబీఐ ముందుకు విజయ్
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:20 AM
కరూర్ దుర్ఘటనకు సంబంధించి ఢిల్లీలో సీబీఐ అధికారులు సోమవారం జరిపిన రెండో విడత విచారణకు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, నటుడు విజయ్ హాజరయ్యారు
ఆరు గంటలకు పైగా విచారణ
చెన్నై, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కరూర్ దుర్ఘటనకు సంబంధించి ఢిల్లీలో సీబీఐ అధికారులు సోమవారం జరిపిన రెండో విడత విచారణకు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, నటుడు విజయ్ హాజరయ్యారు. కరూర్ వద్ద గత ఏడాది సెప్టెంబర్ 27 రాత్రి విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో 41 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఘటనపై సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. దుర్ఘటన జరిగిన వేలుచ్చామిపురం దుకాణాల వ్యాపారులు.., టీవీకే ప్రముఖులు బుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున్, నిర్మల్‌కుమార్ వద్ద విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించారు. కాగా, సోమవారం ఉదయం రెండో విడత విచారణకు కూడా విజయ్ హాజరయ్యారు. కరూర్ రోడ్‌షోకు విజయ్ ఆలస్యంగా వెళ్లటం, వాహనాన్ని జనం అధికంగా ఉన్న ప్రాంతం వరకు తీసుకెళ్లటం, తొక్కిసలాట జరుగుతున్న సమయంలో వాహనం పైనుంచి వాటర్ బాటిళ్లు విసరడం, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధానాలిచ్చినట్టు సమాచారం.
రోడ్‌షోకు రాష్ట్ర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లుచేపట్టి ఉంటారనే నమ్మకంతోనే తాను కరూర్‌కు వెళ్లానని, పోలీసు అధికారుల సూచనల మేరకే ఆ ప్రాంతానికి వెళ్లానని, అర్ధాంతరంగా రోడ్‌షోను ముగించుకున్న తర్వాతే తొక్కిసలాట జరిగినట్టు తెలుసుకున్నానని విజయ్ సీబీఐ అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఆరు గంటలకు పైగా జరిగిన విచారణలో విజయ్ కొన్నిమార్లు ముభావంగా, మరికొన్నిమార్లు వివరంగా సమాధానాలిచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కరూర్ దుర్ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు వచ్చే నెలలో చార్జ్‌షీట్ వేయనున్నట్టు తెలిసింది.