Indian Woman in Pak: పాక్‌లో చిక్కుకుపోయిన భారతీయ మహిళ! తిరిగొచ్చేస్తానంటూ వేడుకోలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:51 PM
పాక్ జాతీయుడిని పెళ్లాడి ఇక్కట్ల పాలయ్యానంటూ ఓ భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌లో వేధింపులు ఎదురవుతున్నాయని, భారత్‌కు తిరిగొచ్చేస్తానని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ జాతీయుడిని పెళ్లాడి ఇక్కట్ల పాలయ్యానంటూ ఓ భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. పంజాబ్‌కు చెందిన సరబ్‌జీత్ కౌర్ గతేడాది సిక్కు మతగురువు గురునానక్ జన్మస్థలం నన్కానా సాహిబ్ సందర్శన పేరిట పాక్‌కు వెళ్లారు. ఆ తరువాత లాహోర్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లాడి అక్కడే ఉండిపోయారు. అయితే, తాను ప్రస్తుతం వేధింపులను ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి తిరిగొచ్చేస్తానంటూ భారత్‌లోని మాజీ భర్తతో ఆమె ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్న ఓ ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతోంది.
కపుర్తలా జిల్లా అమానీపూర్ గ్రామానికి చెందిన సరబ్‌జీత్ కౌర్ వయసు 48 ఏళ్లు. పాక్ పర్యటనకు వెళ్లిన ఆమె ఆ తరువాత తిరిగి రాకపోవడంతో స్వగ్రామంలో కలకలం రేగింది. ప్రియుడు నాసిర్ హుస్సేన్ కోసం తన మతం, పేరును మార్చుకున్న ఆమె గతేడాది నవంబర్ 4న అతడిని పెళ్లాడారు. ఇది పాక్‌లోనూ కలకలానికి దారి తీసింది. విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఆమెను ప్రభుత్వ శరణాలయానికి తరలించారు. ప్రస్తుతం తన భర్త, అత్తింటి వారి చేతుల్లో వేధింపులు ఎదుర్కుంటున్నానని భారత్‌లోని మాజీ భర్తకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పిల్లలను చూడకుండా నేను ఉండలేను. నా గ్రామంలో నేను ఎంతో వైభవంగా బతికాను. వేల రూపాయలను స్థానికులకు దానంగా ఇచ్చేదాన్ని. ఇక్కడ మాత్రం చిన్న మొత్తాలకు కూడా వేడుకోవాల్సిన దుస్థితి దాపురించింది’ అని ఆమె మాజీ భర్తతో అన్నారు (Sarbjeet Kaur Struck in Pakistan)
తాను గూఢచర్యం కోసం పాక్‌కు వెళ్లలేదని కూడా తెలిపారు. నసీర్ హుస్సేన్ వద్ద ఉన్న తన ప్రైవేటు ఫొటోలను డిలీట్ చేయించేందుకు వెళ్లినట్టు మాజీ భర్తకు చెప్పుకొచ్చారు. భారత్‌కు తిరిగొచ్చాక తనను ఏమీ అనొద్దని కూడా అభ్యర్థించారు. అయితే, పాక్ జాతీయుడిని పెళ్లాడిన తరువాత సరబ్‌జీత్ కౌర్ అక్కడి పౌరసత్వం కోసం కూడా ప్రయత్నించినట్టు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా, స్థానిక పోలీసుల వేధింపుల నుంచి తమను కాపాడాలంటూ ఆ జంట స్థానిక న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. ఈ లోపే పోలీసులు ఆమెను స్థానిక శరణార్థుల శిబిరానికి తరలించారు. సరబ్‌జీత్ కౌర్ భారతీయ గూఢచారి అని, వీసా గడువు ముగిసినా పాక్‌లో అక్రమంగా ఉంటోందని ఆరోపిస్తూ పంజాబ్(పాక్) అసెంబ్లీ మాజీ సభ్యుడు ఒకరు లాహోర్ హైకోర్టులో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఇక అట్టారీ-వాఘా బార్డర్ క్రాసింగ్ మూసి ఉంచడంతో సరబ్‌జీత్ కౌర్‌ను డిపోర్టు చేయడం కుదరలేదని పాక్ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి
కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు