Excavations in Lakkundi: కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:48 PM
కర్ణాటకలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన లక్కుండి గ్రామంలో ఓ బాలుడికి 470 గ్రాముల బంగారు నాణేలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ గ్రామంలో తవ్వకాలు జరిపేందుకు పురావస్తు శాఖ రంగంలోకి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్కుండి గ్రామంలో ఇటీవల ఓ బాలుడికి పురాతన కాలం నాటి బంగారు నాణేలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామంలోని కోటె వీరభద్రేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరిపేందుకు పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ, లక్కుండి వారసత్వ పరిరక్షణ సంస్థ, జిల్లా అధికారుల సారథ్యంలో శుక్రవారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి (Karnataka Lakkundi Excavations).
మధ్య యుగాల నాటి నుంచీ అనేక రాజవంశాలు పాలించిన లక్కుండి చరిత్ర ఎంతో గొప్పదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు, విజయనగర రాజులు, ఇతర వంశాల పాలకులు అనేక మంది పరిపాలించారు. అప్పట్లో బంగారు నాణేల ముద్రణకు లక్కుండి కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ బాలుడికి దాదాపు 470 గ్రాముల బరువున్న బంగారు నాణేలు లభించాయి. వీరభద్రేశ్వర ఆలయ సమీపంలోని ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో నాణేలున్న పాత్ర బాలుడి కంట పడింది. దీంతో చిన్నారి స్థానిక అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే అనేక వస్తువులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లక్కుండి ఘన చరిత్ర ఆనవాళ్లు అనేకం వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అధికారులు ఇప్పటికే జేసీబీలు, ట్రక్కులను ఆలయ పరిసరాలకు తరలించారు. అక్కడ ఓ 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతామని తెలిపారు.
కాగా, 2024లో గ్రామంలో జరిపిన తవ్వకాల్లో చారిత్రక ప్రాధాన్యత కలిగిన అనేక వస్తువులు బయటపడ్డాయి. తాజాగా నాణేలు కూడా లభించడంతో మరోసారి లక్కుండి పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రస్తుతం జరుపుతున్న తవ్వకాలకు చారిత్రక ప్రాధాన్యం అత్యధికమని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక చరిత్ర గురించి చెప్పే శాసనాలు, కళాకృతులు, నగలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవీ చదవండి
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి