Justice Yashwant Varma Plea: జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి
ABN , Publish Date - Jan 16 , 2026 | 12:02 PM
అభిశంసనపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అభిశంసనపై పార్లమెంట్ సంయుక్త కమిటినే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ, జనవరి 16: జస్టిస్ యశ్వంత్ వర్మకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. అభిశంసనపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అభిశంసనపై పార్లమెంట్ సంయుక్త కమిటినే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు నిర్ణయంతో పార్లమెంటు కమిటీ విచారణకు అడ్డంకి తొలగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2025, మార్చి 14వ తేదీన రాత్రి 11:35 గంటల ప్రాంతంలో తుగ్లక్ క్రెసెంట్‌లోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి బంగ్లాకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని ఓ గదిలో కాలిపోయిన నగదును కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు ఢిల్లీ హైకోర్టు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మార్చి 20వ తేదీన జస్టిస్ వర్మ నివాసంలో సగం కాలిపోయిన నగదు దొరికినట్లు పలు జాతీయ మీడియాలు వార్తలను ప్రసారం చేశాయి. దీంతో లోతైన దర్యాప్తుకు మద్దతుగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేకి లేఖ రాశారు. ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది. విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది.
పార్లమెంట్‌లో అభిశంసన
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు దొరికిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పార్లమెంట్ ఆయనపై చర్యలకు సిద్ధమైంది. 2025 ఆగస్టు నెలలో జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయ సభల్లో మెమొరాండం సమర్పించారు. లోక్‌సభలో అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని 124, 217, 218 నిబంధనల కింద ఈ నోటీసు ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ కమిటీ ఏర్పాటైంది. అభిశంసనపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఇవి కూడా చదవండి
సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు
ఈ పండ్లు తింటే చాలు.. గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు..