Unnao Case: ఉన్నావ్ అత్యాచార కేసులో హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:12 PM
ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడు కుల్‌దీప్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
ఢిల్లీ, జనవరి19: 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్(Unnao Case)లో జరిగిన సంచలనాత్మక అత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. తనకు విధించిన పదేళ్ల జైలుశిక్షను నిలిపి వేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో సెంగార్ పిటిషన్ వేశాడు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ న్యాయస్థానం.. ఆ పిటిషన్ను కొట్టివేసింది. 'రిలీఫ్ మంజూరు చేయడానికి నిందితుని తరఫు న్యాయవాదులు ఎలాంటి కారణాలూ చూపలేదు. శిక్షను నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన వాజ్యాన్ని తిరస్కరిస్తున్నాం' అని జస్టిస్ రవీందర్ దుడేజా స్పష్టం చేశారు.
ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో ట్రయల్ కోర్టు 2020 మార్చి 13న సెంగార్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని హతమార్చినందుకు దోషి విషయంలో ఎలాంటి సానుభూతీ చూపలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో కుల్దీప్ సెంగార్(Kuldeep Sengar) సోదరుడు అతుల్ సింగ్ సెంగార్‌తో పాటు మరో ఐదుగురికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. సెంగార్ అండతో పోలీసులు.. బాధితురాలి తండ్రిని హింసించారు. చివరకు ఆయన.. 2018 ఏప్రిల్ 9న మరణించాడు.
ఈ అత్యాచార కేసులో నిందితునికి జీవితాంతం జైలుశిక్ష విధించిన డిసెంబర్ 2019 నాటి తీర్పునకు వ్యతిరేకంగా.. అలాగే బాధితురాలి తండ్రి(Unnao Victim) కేసులోనూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యాచార కేసులో తనపై విధించిన శిక్ష, తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో 2025 డిసెంబర్ 23న హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని సీబీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌ను 2025 డిసెంబర్ 29న విచారించిన సుప్రీం న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను నిలిపివేయడంతో పాటు నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇదీ ఘటన..
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నాటి బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. అయితే.. ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2018లో ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత యూపీ ట్రయల్ కోర్టు, ఢిల్లీ కోర్టులకు మారింది. 2019 డిసెంబర్‌లో కుల్దీప్ దోషిగా తేలడంతో అతనిపై జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
ఇవీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..