Python Scare: అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:12 PM
అర్ధరాత్రి కిటికీలోంచి గదిలోకి వచ్చిన కొండచిలువ ఓ మహిళ ఛాతిపైకి చేరిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అది అర్ధరాత్రి.. ఆ మహిళ గాఢ నిద్రలో ఉంది. ఇంతలో ఛాతిపై ఏదో కదులుతున్నట్టు ఆమెకు అనిపించింది. అప్పటికే ఆమె భర్తకూ మెళకువ వచ్చింది. పక్కనున్న భార్య ఛాతిపై భారీ కొండచిలువ కనిపించడంతో అతడికీ గుండె ఆగినంతపనైంది. అయితే ఇద్దరూ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు (Python Crawls over Woman in Australia).
బ్రిస్బేన్‌కు చెందిన మహిళ రేచల్ బ్లూర్, ఆమె భర్తకు ఇటీవల ఓ రాత్రి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. వారి గదిలోకి దాదాపు 8 అడుగుల పొడవున్న కొండచిలువ రావడంతో వారికి ఊపిరి ఆగినంతపనైంది. మహిళ దుప్పటికప్పుకుని నిద్రపోతున్న తరుణంలో కొండచిలువ గదిలోకి చేరింది. కిటికీలోంచి లోపలికి వచ్చి మహిళ ఛాతిపైకి పాకింది. దీంతో, మహిళకు మెళకువ వచ్చినా అది పెంపుడు కుక్క అని అనుకుంది. కానీ మహిళ భర్త ఆమెను అప్రమత్తం చేశాడు. కొండచిలువ గురించి చెప్పాడు. దీంతో, తెరిపారా చూసిన మహిళకు గుండె ఆగినంతపనైంది.
ఈలోపు మహిళ భర్త ఆమె సూచన మేరకు తమ పెంపుడు కుక్కలు పడక గదిలోకి రాకుండా వాటిని మరొక గదిలో కట్టేశాడు. అవి గదిలోకి వచ్చి కొండచిలువను చూస్తే ఉపద్రవం ముంచుకొస్తుందని భయపడ్డ మహిళ భర్తకు వాటిని మరో గదిలోకి తీసుకెళ్లమని చెప్పింది. ఈ క్రమంలోనే మహిళ మెల్లగా దుప్పటి కింద నుంచి జారుకుంటూ పక్కకు తప్పుకుంది. ఆ తరువాత కొండచిలువ వచ్చిన దారిలోంచే వెళ్లిపోయేలా చేసింది. ఇలా పెను ఉపద్రవం తప్పడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొండచిలువను చూసి తనకంటే తన భర్తే ఎక్కువగా భయపడ్డాడని రేచల్ తెలిపింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను పామును చూసి మరీ అంతగా బెదిరిపోలేదని చెప్పింది.
ఇవీ చదవండి:
కుర్చీలో కూర్చున్నా.. పక్కన ఓ కన్నేసి ఉంచాలి.. ఈమె విషయంలో ఏమైందో చూడండి..
నువ్వసలు తల్లివేనా.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తావా..