Greater Noida: ఢిల్లీ ఐటీ యువకుడి మృతి.. వెలుగులోకి సంచలన నిజాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:57 PM
ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో నీటి కుంటలో పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతి ఘటనలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ, జనవరి19: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నొయిడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి నీటికుంటలో పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడు చనిపోయాడని యువరాజ్ తండ్రి ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా.. యువరాజ్ మృతి ఘటనలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువరాజ్ మెహతా మరణానికి గుండెపోటే అసలు కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. యువరాజ్‌ను కాపాడే విషయంలో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువరాజ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. అంతకముందే యువరాజ్ డెడ్ బాడీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కొన్నిగంటల గాలింపు అనంతరం మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాజాగా.. పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుండెపోటు కారణంగానే అతడు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. జనవరి 17న తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా మెహతా కారు అదుపు తప్పి, సెక్టార్ 150లోని నిర్మాణంలో ఉన్న భవనం బేస్‌మెంట్ కోసం తవ్విన 20 అడుగుల కంటే ఎక్కువ లోతైన గుంతలో పడిపోయింది. ఈ క్రమంలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు.
నిబంధనలు పాటించని నిర్మాణంలో ఉన్న సదరు భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధమున్న ఓ జూనియర్ ఇంజినీర్‌ను విధుల నుంచి తొలగించారు అక్కడి అధికారులు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు సంబంధిత పనులకు బాధ్యత వహించే ఇతర అధికారులకూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్మాణ స్థలాల్లో భద్రతా నిబంధనల నిర్లక్ష్యాన్ని సహించబోమని పేర్కొంటూ నొయిడా అథారిటీ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ తమ ప్రాంతాల్లో కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టులలో భద్రతా చర్యలను మరోసారి తనిఖీ చేయాలని అన్ని విభాగాల అధికారులకు సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..