Share News

Magha Masam 2026: మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

ABN , Publish Date - Jan 16 , 2026 | 03:35 PM

మరికొద్ది రోజుల్లో మాఘమాసం ప్రారంభమవనుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం, సముద్ర స్నానం విశేష ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈ మాసంలో వచ్చే పర్వదినాలూ చాలానే ఉన్నాయి.

Magha Masam 2026: మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
Magha Masam

అమ్మవారికి శ్రావణమాసం, పరమశివునికి కార్తీకమాసం, శ్రీమహావిష్ణువుకి మార్గశిరమాసం ఎంత ప్రీతికరమైనవో.. ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఇష్టమైన మాసం మాఘమాసం. ఇంకా చెప్పాలంటే.. దక్షిణాయణంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో.. ఉత్తరాయణంలో మాఘమాసం అంతే విశిష్టమైనదని వేద పండితులు చెబుతారు. ఈ మాసంలో సూర్యుడిని పూజించడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని అంటారు.

మరీ ముఖ్యంగా.. సూర్య నమస్కారాలు చేయడం వల్ల చర్మ వ్యాధులే కాదు.. మధుమేహం తదితర దీర్ఘ అనారోగ్య సమస్యలూ దూరమవుతాయి. అలాగే ఈ మాసంలో నదీ, సముద్ర స్నానాలు, జపం, ధాన ధర్మాలు, పురాణ పఠనం చేస్తే ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్య నారాయణ దండకం చదవడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటారు.


ఈ మాసం ప్రారంభం ఎప్పుడంటే..

2026 జనవరి 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవనుంది. అంటే.. సోమవారం మాఘ శుద్ధ పాడ్యమి తిథి నుంచి మొదలు కానుంది. మరలా ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం మాఘ బహుళ అమావాస్య తిథితో ముగియనుంది. ఈ ఉత్తరాయణ మాసంలో ముఖ్యమైన పండగలన్నీ వస్తాయి. అంటే.. జనవరి 23న వసంత పంచమి, జనవరి 26న రథసప్తమి, జనవరి 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, మరి ముఖ్యంగా ఫిబ్రవరి 15న మహా శివరాత్రి పర్వదినాలు వస్తాయి. ఈ మాసంలో ఆదివారాలు సూర్య భగవానుడిని పూజించడం వల్ల సర్వదా మేలు జరుగుతుందంటారు.


ఈ మాసంలో..

సూర్యభగవానుడికి సంబంధించిన స్తోత్రాలు, విష్ణు సహస్ర నామాలు, పరమ శివుడి స్తోత్రాలు చదవడం వల్ల మేలు జరుగుతుంది.


మాఘ పౌర్ణమి వేళ..

నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయాలి.


శుభముహూర్తాలు..?

మాఘమాసం అంటేనే శుభ ముహూర్తాలకు నెలవు అన్నట్లుగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది ఈ మాసంలో శుభ ముహూర్తాలు లేకపోవడంతో.. వివాహాలు జరగడం లేదు. ఎందుకంటే.. గతేడాది నవంబర్ 26న మార్గశిర శుద్ధ దశమి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ మాఘ బహుళ అమావాస్య వరకు శుక్ర మౌఢ్యమి ఉంది. దీంతో శుభకార్యాలు లేకుండా పోయాయి. కానీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 11 లోపు కొన్ని శుభ ముహూర్తాలున్నాయి. మార్చిలో ఉగాది, శ్రీరామనవమి తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 05:22 PM