సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్తారు.. బహిరంగ సభలో రాహుల్ గాంధీ
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:45 PM
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్తారని ఆయన చెప్పారు.
ఢిల్లీ, నవంబర్ 1: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్తారని ఆయన చెప్పారు. ఓట్ల చోరీ అంటే దేశ పౌరుల గొంతుకను దొంగిలించడమేనని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని అంతం కానివ్వబోమని, రాజ్యాంగాన్ని ధ్వంసం కానివ్వబోమని రాహుల్ స్పష్టం చేశారు. విపక్షాలు నిర్వహిస్తున్న ఈ ర్యాలీ కేవలం రాజకీయ పార్టీల గొంతుక కాదని, దేశ యువత, రైతులు, కార్మికుల గొంతుక అని అన్నారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌కు ప్రజలు బలమైన సందేశం పంపించారని రాహుల్ గాంధీ చెప్పారు. ఎంత డబ్బు, అధికారం ఉన్నా రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన వెల్లడించారు.
‘దేశంలో ఏళ్ల తరబడి ఓట్ల చోరీ జరుగుతోంది. మధ్యప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఓట్ల చోరీ జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల ద్వారా అక్రమాలు జరిగాయి. 2024 ఎన్నికల తర్వాత 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తీసేశారు. ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతం మంది ఓటు హక్కు కోల్పోయారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి అధికారం..
అనంతరం బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘దేశంలోని విద్య, వైద్యం, సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ తన ఆధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా రైతులకు న్యాయం జరగడం లేదు. యువతకు ఉద్యోగాలు రావడం లేదు. కార్మికులకు హక్కులూ దక్కడం లేదు. దేశ సంపద ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తోంది. అంబానీ, అదానీ వంటి వారికి సంబంధించిన వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది. మరోవైపు సామాన్యులను మాత్రం వేధిస్తోంది. రైతులు, విద్యార్థులు, కార్మికులు తమ కష్టానికి తగిన ఫలితం పొందే భారతదేశం కావాలి. దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని అంగీకరించబోం. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై చట్టపరమైన చర్యల కోసం పోరాడుతాం. ఓట్ల చోరీపై దేశం న్యాయం కోరుతోంది.. బాధ్యులు సమాధానం చెప్పాల్సిందే! మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు’ అని లోక్‌సభ ప్రతిపక్షనేత వ్యాఖ్యానించారు.
ఈ నిరసన దేశ ప్రజల గొంతుక
‘మేము హింసను నమ్మేవాళ్లం కాదు.. అహింసను, ప్రేమను నమ్మేవాళ్లం. దేశ ఆత్మపై, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడిని మాత్రం సహించబోము. ప్రతి భారతీయుడి గొంతుక వినిపించడమే మా లక్ష్యం. హిందూ, ముస్లిం, సిక్కు, ఆదివాసీ.. ఇలా అందరి హక్కులను కాపాడాలి. దేశానికి ద్వేషం వద్దు.. ప్రేమ, సోదరభావం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో మళ్లీ ప్రేమ, సోదరభావాన్ని తీసుకొస్తాం.. భారత్‌ను సరైన మార్గంలో నడిపిస్తాం. ఈ నిరసన ఒక్క పార్టీదీ కాదు.. ఒక్క నాయకుడిదీ కాదు. ఇది యావత్ భారతదేశ ప్రజల గొంతుక’ అని రాహుల్ తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఢిల్లీ వ్యాపారాలను కేంద్రమే దెబ్బ తీస్తోంది.. రాహుల్ గాంధీ ఆరోపణలు
ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో పోటాపోటీగా ర్యాలీలు