ఢిల్లీ వ్యాపారాలను కేంద్రమే దెబ్బ తీస్తోంది.. రాహుల్ గాంధీ ఆరోపణలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:19 PM
ఢిల్లీ వ్యాపారుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. దీపావళి పండుగ సీజన్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశరాజధానిలోని వ్యాపారాలను ఇండి కూటమి దెబ్బతీస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ వ్యాపారుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. దీపావళి పండుగ సీజన్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశరాజధానిలోని వ్యాపారాలను ఇండి కూటమి దెబ్బతీస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో వర్తకులకు వేల కోట్ల రూపాయల నష్టం వస్తోందని అంటోంది. మరోవైపు వ్యాపారులు నష్టపోవడానికి కేంద్రమే కారణమని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని దుకాణాలను కాషాయ పార్టీ బలవంతంగా మూసివేయిస్తోందంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇండి కూటమి ర్యాలీకి తరలివస్తున్న వారిని ఢిల్లీ మార్కెట్లలో షాపింగ్ చేయాలని తాము కోరామని రాహుల్ గాంధీ వీడియోలో చెప్పారు. అయితే ఇక్కడి దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయించిందని ఆయన ఆరోపించారు. దీనిబట్టి ఢిల్లీ వ్యాపారాలను దెబ్బతీస్తోంది ఎవరో అర్థమవుతోందని పేర్కొన్నారు.
కాగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఈరోజు రామ్లీలా మైదానంలో ఇండి కూటమి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి సమీపిస్తున్న వేళ.. ఈ నిరసనలు తమ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగ షాపింగ్ కోసం ప్రజలు దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వస్తారని, ఇక్కడ రూ.25 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అందుకే ర్యాలీని వాయిదా వేయాలంటూ ఇటీవల వారు రాహుల్కు లేఖ కూడా రాశారు.
ఈ వార్తలూ చదవండి
ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో పోటాపోటీగా ర్యాలీలు
ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనం: సీజేపీ