Share News

ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనం: సీజేపీ

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:53 PM

ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనబోమని, తాము తటస్థంగా ఉంటామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. తమ సంస్థ గుర్తింపును కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనం: సీజేపీ

ఇంటర్నెట్ డెస్క్: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనబోమని, తాము తటస్థంగా ఉంటామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. తమ సంస్థ గుర్తింపును కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీని దీప్కే కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌‌కు వ్యతిరేకంగా ఇటీవలే జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సీజేపీ ఆందోళనలకు మద్దతు ఇచ్చినందుకు మమతకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు అరెస్టు చేసినపుడు కూడా మమత తమ వెంట ఉన్నారని తెలిపారు.


కాగా.. రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి చేస్తున్న ర్యాలీపై మాట్లాడుతూ.. ర్యాలీకి మద్దతు తెలుపుతున్నామని దీప్కే వెల్లడించారు. అయితే, ఆ ప్రదర్శనలో తాము పాల్గొనబోమని చెప్పారు. ‘సీజేపీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. మేము మా గుర్తింపును కాపాడుకోవాలనుకుంటున్నాం. అదే సమయంలో ఇండియా కూటమి ర్యాలీకి మేము మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఓట్ చోరీపై పోరాడే ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాం’ అని దీప్కే వ్యాఖ్యానించారు.


దీప్కేపై మమత ప్రశంసలు

ఎన్నికల సంఘం, సర్ అక్రమాలపై అభిజీత్ దీప్కే, సీజేపీ నేతలు చేస్తున్న పోరాటం అభినందనీయమని మమతా బెనర్జీ అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ నేతలు వారి పూర్తి మద్దతు తెలిపారని, ఆ ర్యాలీకి సంఘీభావం ప్రకటించారని ఆమె వెల్లడించారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ఉద్యమానికి వారే మార్గదర్శకులు, వ్యవస్థాపకులు అని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా పట్టు వదలకుండా పోరాడుతున్నారని చెప్పారు. బెంగాల్‌లోనూ అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు బెంగాల్‌కు రావాలని వారిని ఆమె ఆహ్వానించారు.

Updated Date - Nov 01 , 2026 | 01:56 PM