Share News

పిల్లాడు కాదు రాక్షసుడు!!

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:47 AM

మూడో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు రాక్షసుడిలా మారాడు. అంత క్రూరత్వం ఎందుకో తెలియదు కానీ.. కేజీ చదువుతున్న ఓ ఆరేళ్ల బాలికపై రెచ్చిపోయాడు.

పిల్లాడు కాదు రాక్షసుడు!!

  • ఆరేళ్ల బాలికపై మూడో తరగతి బాలుడి కిరాతక దాడి

  • పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని, పూల కుండీతో కొట్టిన వైనం

  • గాయాలతో ఆస్పత్రిపాలైన చిన్నారి

  • హరియాణాలో దారుణ ఘటన

న్యూఢిల్లీ, అక్టోబరు 31: మూడో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు రాక్షసుడిలా మారాడు. అంత క్రూరత్వం ఎందుకో తెలియదు కానీ.. కేజీ చదువుతున్న ఓ ఆరేళ్ల బాలికపై రెచ్చిపోయాడు. ఖాళీగా ఉన్న ఓ తరగతి గదిలోకి ఆ చిన్నారిని ఈడ్చుకెళ్లి బెంచీకేసీ కొట్టాడు. ఆపై పిడిగుద్దులు కురిపించాడు. తల, మొహం, మెడ, కడుపు, ఛాతీ, వెన్ను అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చినట్టు ఆ బాలికను బూటికాలితో తన్నేశాడు.. ఆపై ఓ రాయిని ఆమెపై విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ పూలకుండీని ఎత్తి బాలిక తలపై పలుమార్లు పడేశాడు.. ఈ దెబ్బలకు అపస్మారక స్థితిలోకి వెళ్లి రక్తపుమడుగులో పడి ఉన్న బాలిక శరీరంపైకి ఎక్కి కిందికి దిగాడు...!! అంతేకాదు.. ఆ బాలికను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు.. ‘‘ ఇదిగో మీ పాప ఆ గదిలో పడి ఉంది’’ అని చెప్పి ఆ పిల్లాడే వారిని ఆ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ అత్యంత దారుణమైన ఈ ఘటన హరియాణా రాష్ట్రం పంచకులలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అక్టోబరు 28వ తేదీన చోటు చేసుకుంది.


ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియోలో ఆ పిల్లాడి రాక్షసత్వం చూసిన వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఆ పిల్లాడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ కేజీ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. సదరు బాలుడు ఆ చిన్నారిపై ఈస్థాయిలో దాడి చేయడానికి స్పష్టమైన కారణం తెలియదు. అయితే, బాలుడి దురుసు ప్రవర్తనపై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నాయని, బాలుడిపై ఉపాధ్యాయురాలికి ఫిర్యాదు చేస్తానని సదరు బాలిక చెప్పడంతోనే దాడి చేశాడని బాధిత బాలిక మేనమామ విలేకరులతో అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టిన పోలీసులు.. సదరు బాలుడి తల్లిదండ్రులను, పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 03:48 AM