Share News

ఓటు వేయకుండానే బెంగళూరు వెళ్లిపోయిన జగన్

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:07 PM

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్.. చివరకు తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే తిరుగుపయనమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ ఓటు వేయబోనని..

ఓటు వేయకుండానే బెంగళూరు వెళ్లిపోయిన జగన్

కడప: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్.. చివరకు తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే తిరుగుపయనమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ ఓటు వేయబోనని ప్రకటించారు. అంతేకాదు.. రీపోలింగ్ పెడితేనే బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేస్తానని అన్నారు. ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు చూస్తే సంస్కరణలు ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.


ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన వైసీపీ అధినేత జగన్.. మీడియా ముందుకు వచ్చి పోలింగ్ సరళిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో 70 మంది వైసీపీ ఏజెంట్లను బయటకు పంపించారని అన్నారు. అంతేకాదు.. ఇదే అంశంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఆర్‌వో కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించి హంగామా సృష్టించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. ఈ క్రమంలోనే జగన్ తాను ఓటు వేయబోనని.. రీ పోలింగ్ పెడితేనే ఓటు వేస్తానంటూ బెంగళూరుకు వెళ్లిపోయారు.


జగన్ తీరుపై విమర్శలు..

వైసీపీ అధినేత జగన్ తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అధికార కూటమి పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న జగన్.. ఓటు హక్కు వినియోగించుకోకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 04:07 PM