అమేథీకి భయపడి రాయ్‌బరేలీకి వెళ్లారు.. రాహుల్ గాంధీపై ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:05 PM
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసేందుకు భయపడ్డారని, అఖిలేష్ యాదవ్ ఒత్తిడితోనే రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారని ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ బాంబు పేల్చారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ కూటమి మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సాంప్రదాయ స్థానమైన అమేథీ (Amethi) నుంచి పోటీ చేయడానికి భయపడ్డారని , ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి నచ్చజెప్పడం వల్లే ఆయన రాయ్‌బరేలీ (Raebareli) నుంచి పోటీకి దిగారని ప్రతాప్‌గఢ్ ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ చెప్పారు.
'ఎస్పీ మద్దతు లేకపోతే కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాకపోయేది'
పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'రాహుల్ గాంధీ చాలా భయపడ్డారు. తన కుటుంబానికి సాంప్రదాయ స్థానమైన అమేథీని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ అమేథీలో పోటీ చేయకపోతే, తామే స్వయంగా అభ్యర్థిని నిలబెడతామని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. ఆ తర్వాతే రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించారు' అని పటేల్ పేర్కొన్నారు.
కూటమి వల్లే గెలుపు: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ఎస్పీ ఓటర్లందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం వల్లే ఆ పార్టీ 6 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగిందని చెప్పారు.
అతిగా ఆశపడొద్దు: 'యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 50 కంటే ఎక్కువ సీట్లు ఆశించడం ఆపేసి పరిమితులకు లోబడి ఉండాలి. అనవసర వ్యాఖ్యలు మానుకోవాలి' అని ఆయన హితవు పలికారు.
కుల సమీకరణలపై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రాహ్మణుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముస్లింను నియమించడంపై స్పందిస్తూ.. ఈ కుల వ్యూహాలు కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఉపయోగపడవని ఎస్పీ ఎంపీ విమర్శించారు.
ఒక్కరిగా పోటీ చేసిన ప్రతిచోటా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, రాబోయే రోజుల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే దానికి దక్కే సీట్లు 'సున్నా' అని జోస్యం చెప్పారు.
ఇలా ఉండగా, 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయినందున, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ పోటీ చేయలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ అమేథీ నుంచి రాహుల్ గాంధీకి బదులుగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కె.ఎల్. శర్మ (కిషోరి లాల్ శర్మ)ను బరిలోకి దింపింది. అనూహ్యంగా ఆయన అక్కడ భారీ విజయం సాధించారు. అఖిలేష్ యాదవ్ ఒత్తిడి తెచ్చారన్న సంగతి పక్కనపెడితే, రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని ఎంచుకుని, అక్కడ పోటీ చేసి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి..
భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..