భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:33 PM
ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. దానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు విపరీతంగా పెరగడమే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో భారత ఈక్విటీల నుంచి నికరంగా రూ. 35,860 కోట్లను ఉపసంహరించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. దానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు విపరీతంగా పెరగడమే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) సెప్టెంబర్‌లో భారత ఈక్విటీల నుంచి నికరంగా రూ. 35,860 కోట్లను ఉపసంహరించుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది (FPI Outflow September 2026).
విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో జూలైలో సుమారు రూ. 20,200 కోట్లు, ఆగస్టులో రూ. 29,631 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సెప్టెంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏకంగా రూ.35 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, అధిక చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులు పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి అంశాలు భారత మార్కెట్ నుంచి విదేశీ నిధుల ఉపసంహరణకు కారణమయ్యాయి (FPI Selling).
అమెరికా బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకు డాలర్ ఆధారిత ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారతాయి. దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులు బయటకు వెళ్లే అవకాశం పెరుగుతుంది. అలాగే చమురు ధరలు భారత మార్కెట్‌కు మరో పెద్ద సమస్యగా మారాయి. భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశం. అధిక చమురు ధరలు దిగుమతి బిల్లును పెంచుతాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి (Foreign Investors).
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం కూడా ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ పడిపోతే భారత షేర్లలో పెట్టుబడుల నుంచి వచ్చే డాలర్ ఆధారిత రాబడులు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తగ్గించే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..