Share News

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 'యూజీసీ నెట్' పేపర్ లీకైందని ఆరోపణ

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:18 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్' పేపర్ లీకేజీ వివాదం ముగియకముందే మరో ప్రశ్నపత్రం లీకేజీ ఘటన తెరపైకి వచ్చింది. పరీక్షకు ముందే యూజీసీ-నెట్ సోషియాలజీ క్వశ్చన్ పేపర్ లీకైనట్టు ఆరోపణలు వస్తున్నాయి.

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 'యూజీసీ నెట్' పేపర్ లీకైందని ఆరోపణ
Rahul alleges UGC-NET Sociology paper leak

ఇంటర్నెట్ డెస్క్: నీట్-యూజీ పరీక్ష వివాదంపై ఇంకా కొనసాగుతుండగానే యూజీసీ-నెట్(UGC-NET) సోషియాలజీ ప్రశ్నపత్రంపై మరోసారి లీక్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.


యూజీసీ-నెట్ పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ ఒకటి బయటకు వచ్చిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. అందులో సుమారు 90 ప్రశ్నల వరకు ఒరిజినల్ సోషియాలజీ క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలాయన్నారు. ఈ ప్రశ్నపత్రం బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లో సుమారు రూ.2.25 లక్షలకు అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. ఇదే నెట్‌వర్క్ సీఎస్‌ఐఆర్-నెట్, హెచ్‌టీఈటీ, ఏడీఏ వంటి పరీక్షల ప్రశ్నపత్రాలను కూడా సరఫరా చేస్తోందనీ రాహుల్ పేర్కొన్నారు. గత జూన్ 30న జరిగిన ఈ ప్రశ్నపత్రం పరీక్షకు ముందే లీకైందని వచ్చిన మీడియా కథనాలనూ ప్రస్తావించారు రాహుల్. కాగా.. రోహ్‌తక్‌(హరియాణా)లో ఇద్దరు విద్యార్థి నాయకులు ఓ వీడియోనూ పోస్ట్ చేస్తూ.. పరీక్షకు ముందే బోధించిన 2 ప్రశ్నపత్రాల సెట్లలో ఒకటి అసలు దానితో సరిపోలుతోందని పేర్కొన్నారు.


కాగా.. ఈ పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు ప్రశ్నపత్రంలో అనేక అక్షర, వ్యాకరణ దోషాలు సహా క్లారిటీలేని ప్రశ్నలున్నాయనే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కొందరు పలు ఉదాహరణలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్తల పేర్లను తప్పుగా ముద్రించడం సహా సంబంధంలేని ప్రశ్నలను అడిగారని వారు పేర్కొన్నారు. మొత్తం 150 ప్రశ్నల్లో కనీసం 67 ప్రశ్నలు గతంలో నిర్వహించిన 2024 పరీక్షలో వచ్చిన వాటితో పోలి ఉన్నాయని, కనీసం బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాల క్రమమూ మారలేదని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలపై జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు.

Rahul Gandhi.jpg


ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 08 , 2026 | 07:26 PM