డాక్టర్లపై దాడి.. మహారాష్ట్రలో కార్పొరేటర్ అరెస్టు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:18 PM
మహారాష్ట్రలోని థానే జిల్లాలో డాక్టర్లపై దాడి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీ కార్పొరేటర్ రమేశ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో డాక్టర్లపై దాడి ఉదంతం ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీ కార్పొరేటర్ రమేశ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రమేశ్‌తో పాటు ఆయన అనుచరులైన ఐదుగురు వ్యక్తులపై మంగళవారమే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జిల్లాలోని ఒక ఆసుపత్రిలో సృష్టి బవిస్కార్, వైభవ్ సాలంఖే అనే డాక్టర్లు ఒక శిశువును మరో ఆసుపత్రికి తరలించారని చిన్నారి కుటుంబసభ్యులకు సూచించారు. చిన్నారికి తగిన చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రికి తీసుకెళ్లకతప్పదని చెప్పారు. ఈ క్రమంలో వివాదం తలెత్తడంతో శిశువు కుటుంబసభ్యులు కార్పొరేటర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
తన అనుచరులతో పాటు ఆసుపత్రికి వచ్చిన రమేశ్ అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతున్న ఒక మహిళా డాక్టర్‌పై చేయి చేసుకోవడంతో ఆమె ఫోన్ కిందపడిపోయింది. రమేశ్ అనుచరులు ఇతర సిబ్బందిపై విరుచుకుపడ్డ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో డాక్టర్ సాలంఖేకు గాయాలైయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్
దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ భారీగా సోదాలు